Gali Janardan
Reddy to rejoin BJP
లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటక
రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత
గూటికి వెళ్ళనున్నారు. ఇవాళ బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర
నేతల సమక్షంలో పార్టీలోకి చేరనున్నట్టు గాలి జనార్దన రెడ్డి ఆదివారం వెల్లడించారు.
ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ
తమ రక్తంలోనే ఉందన్నారు. ఇప్పుడు సొంత పార్టీలోకి తిరిగి వెడుతున్నట్లు చెప్పారు. ఒకానొక
దశలో బీజేపీకి బైట నుంచి మద్దతు ఇవ్వాలని ఆలోచించామని, కానీ తమ కార్యకర్తలు
విలీనానికే ఓటు వేసారనీ గాలి జనార్దనరెడ్డి చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ మళ్ళీ
ప్రధాని అయ్యేందుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో మరోసారి చేరి సాధారణ
కార్యకర్తలా పని చేస్తానన్నారు.
జనార్దనరెడ్డి బీజేపీలో నుంచి 2022లో
బైటకు వచ్చారు. అప్పుడు కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీని
బీజేపీలో విలీనం చేయడానికి పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. జనార్దనరెడ్డితో
పాటు కేఆర్పీపీ నేతలు అందరూ కాషాయ తీర్థం తీసుకుంటారు. పార్టీ విలీనం గురించి జనార్దనరెడ్డి
ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో చర్చలు జరిపారు.
గాలి జనార్దనరెడ్డి తాజాగాతమ పార్టీ మద్దతుదారులతోకేఆర్పీపీ భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత,
పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం
అనంతరం జనార్దన రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరాలని బీజేపీ నుంచి
ఆహ్వానం అందింది. సోమవారం విజయేంద్ర సమక్షంలో చేరబోతున్నాను. చిత్రదుర్గ, గుల్బర్గ, కొప్పల్, రాయచూర్, బళ్ళారి, విజయనగరం నియోజకవర్గాల కార్యకర్తలు ఆ నిర్ణయానికి
మద్దతు తెలిపారు. బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు అంగీకరించారు అని జనార్దన్
రెడ్డి స్పష్టం చేశారు.