దిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింత్ కేజ్రీవాల్, లిక్కర్ స్కామ్ లో అరెస్టు
కావడంపై జర్మనీ స్పందించిన తీరును భారత ప్రభుత్వం తప్పుపట్టింది.
భారత్ అంతర్గత విషయాల్లో జర్మనీ జోక్యాన్ని
ఎండగట్టింది. దిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను, ఈడీ మార్చి21న అరెస్టు చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా ఆరు రోజుల కస్టడీకి జడ్జి
అనుమతించారు. దీనిపై ఆప్ నేతలు దేశంతో పాటు విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
కేజ్రీవాల్ ను అరెస్టు చేయకుండా కూడా
విచారించవచ్చు అంటూ జర్మనీ ప్రభుత్వం స్పందించింది. ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు
న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు వర్తిస్తాయని
పేర్కొంది. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లేనని భాష్యం చెప్పింది. దీనిపై భారత
ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత అంతర్గత విషయాల్లో జర్మనీ జోక్యాన్ని
తూర్పారబట్టింది.