Nine MLAs including six from Congress join BJP in
Himachal Pradesh
వేడివేడిగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాజకీయంలో కీలక
పరిణామం చోటు చేసుకుంది. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు
స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కాషాయ
కండువాలు కప్పుకున్నారు.
కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి
ఠాకూర్, ఇందర్దత్ లఖన్‌పాల్, దేవేంద్ర భుట్టో, రాజేంద్ర రాణా, చైతన్య శర్మ
బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఆ కార్యక్రమంలో బీజేపీ హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు
రాజీవ్ బిందాల్, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, కేంద్రమంత్రి అనురాగ్
ఠాకూర్ పాల్గొన్నారు.
ఆ సందర్భంగా సుధీర్ శర్మ మాట్లాడుతూ ‘‘మా ప్రజలకు
చేసిన వాగ్దానాలు నెరవేర్చలేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏముంది? అందుకే
రాజ్యసభ ఎన్నికల్లో మా రాష్ట్రానికి చెందిన హర్ష్ మహాజన్‌కు ఓటువేసాం. మేము మా
ఓట్లను దాచిపెట్టుకోలేదు. ఎవరికి ఓటు వేసామో బహిరంగంగానే చెప్పాం. దానివల్ల ఎలాంటి
పరిణామాలు తలెత్తుతాయో మాకు ముందే తెలుసు. ఇవాళ మా అంతట మేమే బీజేపీలో చేరాం. ఒక
వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతిన్నచోట, ఒక వ్యక్తి చెప్పిన మాట ఎవరూ వినని చోట,
ఎక్కువకాలం కొనసాగలేడు’’ అని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్
ప్రభుత్వం నెరవేర్చడం లేదని, అందుకే పార్టీని వీడామనీ రాజేంద్ర రాణా చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు నిన్న శుక్రవారం
రాజీనామా చేసిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బీజేపీలో చేరారు. ఆశిష్ శర్మ,
హోషియార్ సింగ్, కెఎల్ ఠాకూర్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో కాషాయ తీర్థం
తీసుకున్నారు.
ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలూ గత నెల జరిగిన
రాజ్యసభ ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు
ఒకే ఒక స్థానం ఉంది. ఈ తొమ్మిది ఓట్లు అదనంగా కలవడంతో బీజేపీ నిలబెట్టిన అభ్యర్ధి
విజయం సాధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభంలో
పడింది.
హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో 68
నియోజకవర్గాలున్నాయి. 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు 40
స్థానాల్లోనూ, బీజేపీ అభ్యర్ధులు 25 స్థానాల్లోనూ, స్వతంత్ర అభ్యర్ధులు 3
స్థానాల్లోనూ గెలిచారు.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి ఓటువేసిన ఆరుగురు
ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అనర్హత వేటు వేసింది. దాంతో సభలో ఎమ్మెల్యేల సంఖ్య 62కు
పడిపోయింది. అలాగే సాధారణ మెజారిటీ 32కు తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ పక్షంలో
34మంది ఎమ్మెల్యేలు, బీజేపీ పక్షంలో 28మంది ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఈ నేపథ్యంలో
శాసనసభలో మెజారిటీని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష అనే చెప్పాలి.
హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు లోక్‌సభ
స్థానాలున్నాయి. హమీర్పూర్, మండీ, సిమ్లా, కాంగ్రా. 2019లో ఆ నాలుగు స్థానాల్లోనూ
బీజేపీయే గెలిచింది. ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభలో అనర్హత వేటు
పడిన 6 సీట్లకు ఉపఎన్నికలు కూడా జూన్ 1న జరుగుతాయి.