Balidan Diwas: The day when the trio sacrificed their
lives for motherland
1931 మార్చి 23, ముగ్గురు అమరవీరుల
ధిక్కారస్వరాలు ఉరికొయ్యలను వణికించిన రోజు. వారిని ఉరితీసిన ఆ రోజు భారత
స్వాతంత్ర్య సంగ్రామంలో మహోద్విగ్నకరమైన రోజు. భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్, శివరామ్
రాజ్‌గురు అనే ముగ్గురు అతివాద యువకులు తెల్ల దొరతనాన్ని ఎదుర్కొని, తమ ప్రాణాలను
బలిదానం ఇచ్చిన రోజు. ఆ విప్లవమూర్తుల త్యాగానికి యావద్దేశం శిరసువంచి నివాళులర్పించే
రోజు ఈ రోజు.
భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్ 28న అప్పటి పంజాబ్ ప్రొవిన్స్‌లో
జన్మించాడు. చిన్నవయసులోనే అమిత ధైర్య సాహసాలు ప్రదర్శించి, దేశమాత పట్ల నిబద్ధతను
చాటుకున్నాడు. దేశవిముక్తి కోసం చదువును తృణప్రాయంగా వదిలేసాడు. దేశభక్తికి మేధోశక్తిని
జోడించి విప్లవమార్గాన్ని ఎంచుకున్నాడు. సహఉద్యమకారులు సుఖదేవ్, రాజ్‌గురుతో కలిసి
భగత్‌సింగ్ బ్రిటిష్ ప్రభుత్వపు అరాచకాలను ధిక్కరించే సాహసాలు చేసాడు.
భవిష్యత్తరాలకు స్ఫూర్తిగా నిలిచాడు.
పంజాబ్‌కేసరి లాలా లజపత్ రాయ్‌ని బ్రిటిష్
ప్రభుత్వం అన్యాయంగా చంపేసిన సంఘటనతో భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు ఆగ్రహంతో ఊగిపోయారు. దానికి
ప్రతీకారంగా లాహోర్‌లో సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను హతమార్చాలని భావించారు.
అయితే స్కాట్‌ను గుర్తించడంలో జరిగిన పొరపాటు కారణంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్
జాన్ సాండర్స్‌ను హతమార్చారు. అయినా జేమ్స్ స్కాట్‌ను తుదముట్టించాలన్న వారి
దృఢనిశ్చయంలో మార్పు రాలేదు.
1929 ఏప్రిల్‌లో భగత్‌సింగ్ మరో విప్లవ వీరుడు
బటుకేశ్వర్ దత్తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీ హాలులో బాంబులు విసిరారు.
ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ రణన్నినాదాలు చేసారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం
అరెస్ట్ చేయడం భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని మేలిమలుపు తిప్పింది.
బ్రిటిష్ ప్రభుత్వం ఆ విప్లవవీరుల ధిక్కారాన్ని
భరించలేకపోయింది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురులను 1931 మార్చి 23న ఉరితీసింది. తమ
ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయని తెలిసినా ఆ వీరులు ఏమాత్రం భయపడలేదు. ఒక మహత్తరమైన
కారణం కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నామన్న గర్వంతో, ఏమాత్రం తొణకని
స్థైర్యంతో వారు ఉరికొయ్యనెక్కారు. మాతృభూమి పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు లాహోర్
కుట్ర కేసు సాక్ష్యంగా నిలిచింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో వారి పేర్లు
సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి.
ఆ స్వేచ్ఛాపిపాసువులకు యావత్ భారతదేశం ఇవాళ
నివాళులర్పిస్తోంది. వారి వీరగాధ దేశం నలుమూలలా ప్రతిధ్వనిస్తోంది. వారి వీరగాధలు
యువతకు ప్రేరణగా నిలిచాయి. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే ఆదర్శాలను యువతరానికి
బోధిస్తున్నాయి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు ఏ ఆదర్శాల కోసం తమ ప్రాణాలను
తృణప్రాయంగా వదిలేసారో, ఆ ఆదర్శాల పట్ల దేశం తన అచంచలమైన నిబద్ధతను ప్రకటించడానికి
బలిదాన్ దివస్ జరుపుకుంటోంది.