Stalin govt files case on school whose children attended PM program
తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే
ప్రభుత్వం కొత్త వివాదానికి తెరతీసింది. కోయంబత్తూరులో ఇటీవల ప్రధానమంత్రి
నిర్వహించిన రోడ్‌షోకు పిల్లలను పంపించిన నేరానికి ఓ పాఠశాలపై కేసు పెట్టింది. డీఎంకే
ప్రభుత్వ నిర్ణయం కక్షసాధింపు చర్య అంటూ తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
ప్రధానమంత్రి మద్దతుదారులు, బీజేపీ సానుభూతిపరులు
కోయంబత్తూరులో మార్చి 18న ప్రధానమంత్రి పర్యటనలో రోడ్ షో నిర్వహించారు. ఆ
కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పెద్దసంఖ్యలో ప్రజలు తమ
కుటుంబాలతో, చిన్నపిల్లలతో సహా హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే
ప్రభుత్వం ఆ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడానికి విశ్వప్రయత్నాలు చేసింది.
పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయనీ, షో జరిగే ప్రాంతంలో మైనారిటీలు అధికసంఖ్యలో
ఉన్నారనీ, మతఘర్షణలు చెలరేగే అవకాశం ఉందనీ కుంటిసాకులు చెప్పింది. అయితే మద్రాస్
హైకోర్టు వాటిని వేటినీ పరిగణనలోకి తీసుకోలేదు. తనను ఎన్నుకున్న ప్రజలతో భేటీ
అయ్యేందుకు ప్రధానమంత్రికి ప్రాథమికమైన హక్కు ఉందంటూ, రోడ్ షోకు అభ్యంతరపెడుతూ
డీఎంకే ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టిపడేసింది.
స్థానిక ప్రజలు ప్రధానమంత్రి రోడ్ షో 4
కిలోమీటర్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. కానీ భద్రతా కారణాలు చూపి
అధికారులు రోడ్ షోను 2 కిలోమీటర్లకే పరిమితం చేసారు. అయినప్పటికీ ప్రధాని మోదీని
చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. ఆ కార్యక్రమానికి మంచి స్పందన
లభించడంతో డీఎంకే అధినాయకత్వానికి కన్నుకుట్టింది. ఫలితం, ఆ రోడ్ షోలో పాల్గొన్న
విద్యార్ధులు చదువుతున్న పాఠశాలపై ఎఫ్ఐఆర్ నమోదయింది. అయితే, ప్రధాని రోడ్‌షోలో విద్యార్ధులు
స్వచ్ఛందంగా పాల్గొన్నారా లేక వారిని సమీకరించారా అన్న విషయంలో స్పష్టత లేదు.
రోడ్‌షోలో విద్యార్ధులు పాల్గొనడంపై కోయంబత్తూరు పార్లమెంటరీ
నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పి సురేష్, బీజేపీ జిల్లా శాఖ
అధ్యక్షుడికి నోటీసులు జారీ చేసారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని
ఆరోపిస్తూ ఆ సంఘటనపై వివరణ కోరారు. కోయంబత్తూరు జిల్లా ప్రాథమిక విద్య అధికారిణి
పునీత ఆంథోని అమ్మాళ్ ఆ సంఘటనపై విచారణ నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న పిల్లలు
చదువుతున్న ‘శ్రీ సాయిబాబా విద్యాలయం ఎయిడెడ్ మిడిల్ స్కూల్’ హెడ్‌మాస్టర్, మిగతా
స్టాఫ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. ఏ చర్యలు
తీసుకున్నదీ వెల్లడిస్తూ 24గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు.
రోడ్‌షో అనే రాజకీయ కార్యక్రమంలో విద్యార్ధులు
పాల్గొనడం నైతికపరమైన, చట్టపరమైన చర్చలకు దారితీసింది. అయితే విద్యార్ధులు మాత్రం
తాము ఆ కార్యక్రమానికి తమ తల్లిదండ్రుల అనుమతితో వెళ్ళామని, దేశ ప్రధానమంత్రిని
చూసే అవకాశంగా మాత్రమే భావించామనీ చెబుతున్నారు. విద్యాపరమైన కుతూహలంతో మాత్రమే
ప్రధానమంత్రిని చూడడానికి వెళ్ళాం తప్ప తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలూ లేవని
చెబుతున్నారు.
అలాగే, ఈ రోడ్‌షో ముందు నిర్వహించిన సాంస్కృతిక
కార్యక్రమాల్లో చిన్మయ విద్యాలయ గ్రూప్‌కు చెందిన మూడు స్థానిక పాఠశాలలలోని 22మంది
పిల్లలు పాల్గొన్నారు. దాంతో ఆ పాఠశాల యాజమాన్యానికి జిల్లా విద్యా అధికారి (డీఈఓ)
నోటీసులు పంపించారు.
డీఎంకే ప్రభుత్వం ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
కూడా చేసింది. 15ఏళ్ళలోపు పిల్లలను బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ బలవంతం
చేసి తీసుకెళ్ళారని ఆరోపిస్తూ డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి, ఈసీకి
ఫిర్యాదు చేసారు.
అయితే, డీఎంకే రాజకీయ
కార్యక్రమాలకు విద్యార్ధులను బలవంతంగా తరలించిన సందర్భాలను తమిళనాడు బీజేపీ నేతలు,
ఇతర విమర్శకులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా, పాఠశాల యాజమాన్యాలపై
ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటివరకూ ఎన్నడూ కనీవినీ ఎరుగని సంఘటన అని చెప్పాల్సిందే.