Sheik Shahjahan sent on six day police custody
Sandeshkhali ED attack case
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై
దాడి చేసిన కేసులో నిందితుడు షేక్ షాజహాన్‌కు కోల్‌కతా న్యాయస్థానం ఆరు రోజుల
పోలీస్ కస్టడీ విధించింది. షేక్ షాజహాన్తో పాటు సహనిందితులైన సుకుమార్ సర్దార్,
మెహబుల్ మొల్లాలను కూడా ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు వారి తరఫు
న్యాయవాది రజా భౌమిక్ తెలియజేసారు.
షేక్ షాజహాన్‌కు బెయిల్ కోసం ఆరోగ్య కారణాలతో పిటిషన్
దాఖలు చేసినట్లు న్యాయవాది వెల్లడించారు. అతనికి వెన్నునొప్పి ఉందని, దానికి
సంబంధించిన మెడికల్ రికార్డులను ఈడీ అధికారులు జప్తుచేసారనీ న్యాయవాది చెప్పారు.
సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
అధికారులపై దాడి చేసిన కేసులో నిందితులైన షేక్ షాజహాన్, అతని అనుచరులను సీబీఐ
మార్చి 22న కోర్టు ముందు ప్రవేశపెట్టింది. అదేరోజు అదే కేసుకు సంబంధించి షాజహాన్
సోదరుడు షేక్ ఆలంగిర్ తదితరులను బసీర్హాట్ కోర్టులో ప్రవేశపెట్టింది. అతన్ని
కోర్టు 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.
జనవరి 5న సందేశ్‌ఖాలీ సందర్శించడానికి వచ్చిన ఈడీ
అధికారుల బృందంపై దాడి చేసిన ఆరోపణల మీద సీబీఐ ఆలంగిర్, మరో ఇద్దరిని మార్చి 16న
అరెస్ట్ చేసింది. అంతకంటె ముందు, కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో కోల్‌కతా సీఐడీ
పోలీసులు తమ అధీనంలో ఉన్న షేక్ షాజహాన్‌ను సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఆ విషయంలో
సీఐడీ దాగుడుమూతల వ్యవహారాలపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈడీ అధికారుల కేసు విచారణ సమయంలో సందేశ్‌ఖాలీ
మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమపై షేక్ షాజహాన్, అతని అనుచరులు పాల్పడిన
అత్యాచారాలు, భూ ఆక్రమణల గురించి బహిర్గతం చేయడంతో ఈ కేసు జాతీయస్థాయిలో సంచలనం
సృష్టించింది.