CBI raids
Mahua Moitra Home in Cash for Query Case
కోల్‌కతాలోని తృణమూల్ కాంగ్రెస్
నాయకురాలు మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ ఈ ఉదయం సోదాలు నిర్వహించింది.
పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్న కేసు విచారణలో భాగంగా సీబీఐ ఈ
సోదాలు చేపట్టింది.
ప్రశ్నలకు డబ్బుల కేసులో మహువా మొయిత్రా
మీద ఉన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఈ వారం మొదట్లో లోక్‌పాల్ సీబీఐని ఆదేశించింది.
ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. ఆ మేరకు,
ఆ కేసుకు సంబంధించి సీబీఐ నిన్న శుక్రవారం
నాడు ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసింది.
సీబీఐ విచారణ జరిగినంత కాలం నెలనెలా
నివేదికలు సమర్పించాలని లోక్‌పాల్ ఆదేశించింది. ‘‘ఈ కేసుకు సంబంధించి అందుబాటులో
ఉన్న, నమోదయిన వివరాలను పరిగణించి పరిశీలించి చూసాక, సదరు నిందితురాలిపై మోపిన
ఆరోపణలకు తగినన్ని ఆధారాలు కనిపిస్తున్నందున, ఆ ఆరోపణలు స్వభావరీత్యా తీవ్రమైనవని
భావిస్తున్నాం. ప్రత్యేకించి ఆమె ఎంపీగా ఉన్నందున ఆ ఆరోపణలు మరింత గంభీరమైన స్వభావం
కలిగి ఉన్నవనడంలో సందేహమే లేదు’’ అని లోక్‌పాల్ వ్యాఖ్యానించింది.
మహువా మొయిత్రాను గతేడాది డిసెంబర్‌లో లోక్‌సభ
నుంచి బహిష్కరించారు. పార్లమెంటులో, అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రశ్నలు
అడగడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచాలు తీసుకున్న ఆరోపణలపై
అప్పటికి ఎంపీగా ఉన్న మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించాలని ఎథిక్స్
కమిటీ సిఫారసు చేసింది.
పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి
ఎంపీలకు ఇచ్చే లాగిన్ వివరాలను వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచ్చినట్లు ఆమెపై
ఆరోపణలున్నాయి. దర్శన్‌కు తన లాగిన్ వివరాలు ఇచ్చినట్లు మహువా మొయిత్రా
అంగీకరించారు. అయితే దానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలను మాత్రం నిరాకరించారు.
ఎంపీలు తమ లాగిన్ వివరాలను వేరేవారికి షేర్ చేయడం సర్వసాధారణం అని మహువా
వాదించారు. తనను పార్లమెంటు సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ మహువా
మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.