ISIS terror
attack on Moscow, 60 died, over 100 injured
రష్యా రాజధాని మాస్కోలోని ఓ కచేరీ హాల్లో
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ
ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
దాడి చేసిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.
అయితే, దాడి చేసిన వారు సైనికులు ధరించేలాంటి దుస్తులు ధరించారని అధికారులు
చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి
ఘనవిజయం సాధించి అధికారంపై పట్టు పెంచుకున్న కొద్ది రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం.
మాస్కో పశ్చిమ శివార్లలో 6200 మంది కూర్చోగల క్రోకస్ సిటీ హాల్ మీద ఉగ్రవాదులు దాడి చేసారు. ఆ సమయంలో
రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శన జరుగుతోంది. దుండగులు పేలుడు పదార్థాలను
విసిరి, ఆ తర్వాత కచేరీ హాలుకు నిప్పుపెట్టారు. ఆ మంటల్లో మరింత మంది చిక్కుకుని
ఉంటారని భావిస్తున్నారు.మంటల ధాటికి కచేరీ హాల్ పైకప్పు సైతం
కూలిపోయింది.
ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపారని,
ఆ తర్వాత గ్రెనేడ్లు, బాంబులు విసిరారని తెలుస్తోంది. దుండగులు అక్కడి నుంచి పారిపోయేందుకు
ఉపయోగించిన వాహనాల కోసం అధికారులు గాలిస్తున్నారు.
ఇది రక్తసిక్తమైన ఉగ్రవాద దాడి అని
రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. ఈ నీచమైన నేరాన్ని
యావత్ అంతర్జాతీయ సమాజం ఖండించాలని టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. అమెరికా
అధ్యక్షుడుఈ దాడిని భయంకరమైనదిగా పేర్కొన్నారు.
మాస్కోలో ఉగ్రవాదుల దాడిని భారత ప్రధానమంత్రి
తీవ్రంగా ఖండించారు. “మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి. ఈ విషాద సమయంలో రష్యా
ఫెడరేషన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది‘
అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.