కాకినాడ
జిల్లా యు కొత్తపల్లి మండల పరిధిలోని మూలపేటలోని సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్
పరిశ్రమలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది
వివరాలు సేకరించిన సీబీఐ టీమ్, పరిశ్రమలో సోదాలు నిర్వహించింది. ఫోరెన్సిక్ సిబ్బంది
సాయంతో ఆక్వా ల్యాబ్ పరిశ్రమలోని కెమికల్
శాంపిల్స్ ను పరీక్షకు పంపారు.
విశాఖలో
మూడు రోజుల కిందట పెద్ద మొత్తంలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడింది.
విశాఖలోని
కన్సిగ్సీ పేరుతో ఓ ప్రైవేటు కంపెనీకి 25 కిలోల చొప్పున 1000 బస్తాల్లో డ్రగ్స్
చేరవేస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.
బ్రెజిల్
నుంచి జర్మనీ మీదుగా ఓ కంటైనర్ లో ఈ డ్రగ్స్ ను చేరవేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్
మీదుగా ఈ కంటైనర్ విశాఖకు చేరింది. ఇంటర్ పోల్ నుంచి దిల్లీ సీబీఐ కి సమాచారం
అందగా, విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. నార్కో
టిక్స్ అధికారులతో వచ్చి కంటైనర్ ను పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు తేలింది.
అయితే
ఈ డ్రగ్స్ ముఠా వెనుక మీరున్నారంటే మీరున్నారంటూ ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ
పార్టీలు ఆరోపించుకుంటున్నాయి.
వైసీపీ
పాలనలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేపిటల్ గా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ
పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సహా పలువురు ఆరోపించారు. ఈ ఆరోపణలను వైసీపీ
బలంగా తిప్పికొట్టింది.
టీడీపీ
నేతల ఆరోపణలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి
సహా ఇతర నేతలు మండిపడ్డారు. వైసీపీ కి రాజకీయంగా నష్టం చేసే ఉద్దేశ్యంతో ఆధారాలు
లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
డ్రగ్స్
ముఠా వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని అనుమానించాల్సి వస్తోందని సజ్జల
రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఆయన
కుమారుడు, చంద్రబాబు బంధువు అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి, వారి
గ్యాంగ్ హస్తం ఉందని అనుమానించాల్సి వస్తుందన్నారు.
డ్రగ్స్
కంటైనర్ పట్టుబడిన విషయం బయటకు పొక్కిన వెంటనే ట్వీట్ చేసిన చంద్రబాబు, విశాఖలో
భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడటం విస్మయం కలిగిస్తోందన్నారు. ఎన్నికల కోసం
వైసీపీ డ్రగ్స్ తెప్పించినట్లుగా ఉందని ఆరోపించారు. పోర్టు సిబ్బంది తీరు చూస్తేంటే
అధికార పక్షం హస్తం ఉన్నట్లు ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు.
పురందరేశ్వరిపై
వైసీపీ నేతలు చేసిన విమర్శలను బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ
ఖండించారు. కూనం వీరభద్రరావుకు చెందిన సంస్థ, సంధ్యా ఆక్వా ప్రైవేటు లిమిటెడ్
పేరుతో విశాఖకు కంటెయినర్ వచ్చిందన్నారు.
ఆ కంపెనీ యాజమానికి వైసీపీ తో సంబంధాలు ఉన్నాయని, అతడి సోదరుడు వైసీపీ నేతే
అన్నారు. పురందరేశ్వరి పై అసత్య ప్రచారాలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు
తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కు రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం, డ్రగ్స్ అడ్డాగా రాష్ట్రాన్ని
మార్చేసిందని
జనసేన
అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు
ఏపీలో ఉండటం సిగ్గు చేటు అన్నారు.