Allahabad High Court declares Madrasa Education
Unconstitutional
అందరికీ సమానంగా విద్యను అందించే దిశగా అలహాబాద్
హైకోర్టు ఇవాళ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదరసా
ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ను రాజ్యాంగ విరుద్ధం అని విస్పష్టంగా ప్రకటించింది. ఆ చట్టం
మాత్రమే కాదు, మదరసా విద్య అనేదే లౌకికవాదానికి వ్యతిరేకమని తేల్చిచెప్పింది.
అలాంటి మతబోధనల విద్యాసంస్థల్లో ఇరుక్కుపోయిన విద్యార్ధులను సాధారణ
విద్యావ్యవస్థలోకి ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ వివేక్ చౌధురి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో
కూడిన ద్విసభ్య ధర్మాసనం మదరసా విద్యా చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకం అని
పేర్కొంది. మదరసాల్లో చదువుకుంటున్న పిల్లలను సాధారణ విద్యనందిస్తున్న పాఠశాలలకు
మార్చాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. యూపీలోని యోగి ఆదిత్యనాథ్
ప్రభుత్వం రాష్ట్రంలోని ఇస్లామిక్ విద్యాసంస్థలపై సర్వే చేపట్టాలని నిర్ణయించిన
కొన్ని నెలల తర్వాత ఈ తీర్పు రావడం విశేషం. అలాగే, యోగి సర్కారు 2023 అక్టోబరులోనే
మదరసాలకు విదేశాల నుంచి వచ్చే నిధుల విషయాన్ని పరిశోధించాలంటూ ప్రత్యేక దర్యాప్తు
బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో 25వేలకు పైగా మదరసాలు ఉన్నాయి.
వాటిలో సుమారు 16,500 మదరసాలకు యూపీ బోర్డ్ ఆఫ్ మదరసా ఎడ్యుకేషన్ అధికారిక
గుర్తింపు ఉంది.
అన్షుమాన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి అలహాబాద్
హైకోర్టులో యూపీ మదరసా బోర్డుకు వచ్చే నిధులు, వాటి నిర్వహణ వ్యవహారాలను సవాల్
చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసాడు. మదరసాల నిర్వహణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు
చెందిన మైనారిటీ సంక్షేమ శాఖల పాత్ర, తదితర వ్యవహారాలను కూడా ఆ పిటిషన్ ద్వారా
సవాల్ చేసాడు.
ఆ పిటిషన్ తర్వాత, 2023 డిసెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు
డివిజన్ బెంచ్ విద్యాసంస్థల నిర్వహణలో పారదర్శకత ఆవశ్యకతను నొక్కి వక్కాణించింది.
మదరసాల నిర్వహణలో అటువంటి పారదర్శకత లోపించిందని ఆందోళన వ్యక్తం చేసింది.
అంతకుముందు 2019 అక్టోబర్‌లో మొహమ్మద్ జావేద్
వెర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ అదర్స్ రిట్ పిటిషన్‌లో సైతం, మదరసా బోర్డు
నిర్మాణం, దాని పనితీరు గురించి పలు సందేహాలు లేవనెత్తుతూ హైకోర్టు ఆందోళన వ్యక్తం
చేసింది. ఆ సందర్భంగా హైకోర్టు అడిగిన ప్రశ్నలేంటంటే…
మదరసా బోర్డు ఏర్పాటు ఉద్దేధశం అరబిక్, ఉర్దూ,
పర్షియన్, ఇస్లామిక్ స్టడీస్, తదితర అంశాల్లో విద్యాబోధన. అలాంటప్పుడు ఆ బోర్డులో
ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులకు మాత్రమే సభ్యత్వం ఎలా ఇస్తారు? అక్కడ ఆయా
అభ్యసన అంశాల్లో నైపుణ్యం గురించి కాక ఒక మతానికి చెందిన వ్యక్తుల గురించి మాత్రమే
చర్చ జరుగుతోంది. ఈ బోర్డు ఉద్దేశం కేవలం మతవిద్యను వ్యాప్తి చేయడం మాత్రమేనా అని అడిగినప్పుడు
బోర్డు ప్రతినిధులు, 2004 నాటి మదరసా విద్య చట్టం ప్రకారం అలాంటిదేమీ లేదని
స్పష్టం చేసారు.
భారతదేశంలో లౌకిక రాజ్యాంగం ఉంది కాబట్టి మదరసా
విద్య బోర్డులో సభ్యులుగా ఏ మతానికి చెందిన నిపుణులనైనా నియమించవచ్చా లేక నామినేట్
చేయవచ్చునా? లేక కేవలం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులను మాత్రమే నియమించడం
లేదా నామినేట్ చేయడం జరగాలా?
ఆ చట్టం ప్రకారం మదరసా విద్యా బోర్డు రాష్ట్ర
మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేయాలి. అంటే జైనులు, సిక్కులు, క్రైస్తవుల వంటి
ఇతర మైనారిటీల విద్యాసంస్థలు కూడా విద్యాశాఖ కింద ఉన్నప్పుడు మదరసాలు మాత్రమే
మైనారిటీ సంక్షేమ శాఖ కింద ఉండాలా? విద్యావేత్తల విధానాల వల్ల కలిగే లాభాలను
మదరసాల్లో చదువుకునే విద్యార్ధులకు నిరాకరిస్తున్నట్లే కదా?
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఇండోనేపాల్
సరిహద్దు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్న 1500కు పైగా మదరసాలకు
ఫండింగ్ ఎలా, ఎక్కడినుంచి వస్తుందో తెలుసుకోడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీ ప్రభుత్వం
ప్రయత్నాలు ప్రారంభించింది.
2023 అక్టోబర్‌లో రాష్ట్రప్రభుత్వ సర్వే ప్రకారం
ఉత్తరప్రదేశ్‌లో 2023 నాటికి 7500కు పైగా రిజిస్టర్ కాని మదరసాలు ఉన్నాయని తేలింది.
అంతకుముందు, రిజిస్టర్ కాని మదరసాల్లో ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, విద్యార్ధులు
ఎంతమంది ఉన్నారు, ఏ విద్యాంశాలు బోధిస్తున్నారు, ఏ స్వచ్ఛందసంస్థకైనా అనుబంధంగా
నడుస్తున్నాయా వంటి విషయాలపై సర్వే చేపట్టడతామని 2023 సెప్టెంబర్ 1న యూపీ
ప్రభుత్వం ప్రకటించింది.
2023 ఆగస్టులో యోగి ప్రభుత్వం, రాష్ట్రంలోని
గుర్తింపు పొందని మదరసాల గురించి సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్లను
ఆదేశించింది. ఆ సర్వే రెండు నెలల పాటు కొనసాగింది. 8,449 మదరసాలకు గుర్తింపు లేదని
ఆ సర్వేలో వెల్లడైంది. నేపాల్ సరిహద్దుకు సమీపంలోని లఖీంపూర్ ఖేరీ, ఫిలిభిత్,
శ్రావస్తి, సిద్దార్ధనగర్, బహ్రెయిచ్తదితర
ప్రాంతాల్లో వెయ్యికి పైగా అక్రమ మదరసాలు ఉన్నట్లు గుర్తించారు. గత కొన్నేళ్ళుగానే
మదరసాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందనీ, వాటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయనీ
గుర్తించారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 16,513 గుర్తింపు
పొందిన మదరసాలు ఉన్నాయి. వాటిలో 560 మదరసాలకు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు
వస్తున్నాయి. విదేశీ నిధులు వస్తున్న, రాష్ట్ర గుర్తింపు లేని మదరసాల్లో బలవంతపు
మతమార్పిడులు, దేశ వ్యతిరేక కార్యకలాపాలూ జరుగుతున్నాయన్న సమాచారం ఉంది.