Women from Kashmiri separatist families declare allegiance
to Bharat
భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో తీసుకుంటున్న
నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాజ్యాంగంలోని 370వ అధికరణం తొలగింపు, పాక్
ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూభాగంపై భారత్ వాస్తవిక హక్కును ప్రకటించడం, పీఓకేలోని
భాగాలు సహా కశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతుండడం వంటి చర్యలు స్థానిక
ప్రజల్లో భారత అనుకూల భావనలను పెంచుతున్నాయి. ఆ క్రమంలో, వేర్పాటువాద నాయకుల
కుటుంబాలలోని మహిళలు సైతం భారత్‌కు విధేయత ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది.
కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు షబీర్ షా కుమార్తె
సమా షబీర్, భారతదేశానికి తాను విధేయురాలినని ఒక బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించింది.
కశ్మీర్ ప్రాంతంలో పనిచేస్తున్న వేర్పాటువాద గ్రూపులతో తనకు ఏ సంబంధమూ లేదని
స్పష్టం చేసింది. శ్రీనగర్ నుంచి వెలువడే ‘ది న్యూస్ నౌ’ అనే దినపత్రికలో ఇవాళ
సమా షబీర్ ఒక ప్రకటన ఇచ్చింది. ‘‘నేను భారతదేశానికి విధేయురాలినైన పౌరురాలిని.
భారతదేశపు సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏ వ్యక్తి లేదా సంస్థకు నేను
అనుబంధంగా లేను. డెమొక్రటిక్ ఫ్రీడం పార్టీ అనే రాజకీయ పార్టీతో కానీ, దాని సిద్ధాంతాలతో
కానీ నాకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని సమా షబీర్ ఆ ప్రకటనలో వివరించింది. తనను
వేర్పాటువాద గ్రూపులతో కలిపి చూపే ప్రయత్నాలు చేసే వ్యక్తులు లేదా సంస్థలపై
చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.
షబీర్ షా కశ్మీర్ వేర్పాటువాది. కశ్మీరీ ఉగ్రవాదులకు
నిధులు సమకూర్చే ప్రయత్నాల్లో మనీ లాండరింగ్ కేసులో అతన్ని ఎన్ఐఏ 2017లో అరెస్టు
చేసింది. అప్పటినుంచీ అతను జైల్లోనే ఉన్నాడు. 2005లో అస్లామ్వనీ అనే వ్యక్తిని
ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. డెమొక్రటిక్ ఫ్రీడం పార్టీ కోసం షబీర్ షాకు
నిధులు ఇవ్వడానికి భారీమొత్తంలో డబ్బులు తరలించే క్రమంలో అతను పోలీసులకు
దొరికిపోయాడు.
సమా షబీర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2019
ఏప్రిల్‌లో సమన్లు జారీ చేసింది. అయితే ఆమె ఈడీ ముందు హాజరు కాలేదు. తాను ఆ సమయంలో
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఉన్నాననీ, అక్కడ న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నాననీ ఆమె
వెల్లడించింది.
మరోవైపు, కొంతకాలం క్రితం మరణించిన సయ్యద్ అలీషా
గిలానీ మనవరాలు రువా షా కూడా వేర్పాటువాదానికి దూరం జరిగింది. గిలానీ మనవరాలు,
అల్తాఫ్ షా అలియాస్ ఫంటూష్ కుమార్తె అయిన రువా షా కూడా ఇవాళ స్థానిక దినపత్రికలో
అటువంటి ప్రకటనే ఇచ్చింది. గిలానీ నాయకత్వంలోని హురియత్ కాన్ఫరెన్స్ పట్ల ఎలాంటి
మొగ్గు కానీ సానుభూతి కానీ తనకు లేదని రువా షా కూడా స్పష్టం చేసింది.
సయ్యద్ అలీషా గిలానీ అల్లుడు ఫంటూష్. గిలానీ
కూడబెట్టిన సొమ్ములన్నిటి మీదా పెత్తనం అతనిదే అంటారు. అతన్ని, మరో ఆరుగురిని
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జులై 2017లో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. తర్వాత అతన్ని తిహార్ జైల్లో బంధించారు. ఆ
సమయంలోనే అతనికి క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
పొందుతుండగానే 2022 అక్టోబర్‌లో ఫంటూష్ మరణించాడు.
ఫంటూష్ కుమార్తె రువా షా చాలాకాలం
వేర్పాటువాదానికి అనుకూలంగా వ్యవహరించింది. ఆమె ఎక్స్ అకౌంట్లో ఇప్పటికీ,
వేర్పాటువాదానికి మద్దతిస్తూ ఆమె చేసిన ట్వీట్లు కనిపిస్తూనే ఉన్నాయి.
సమా షబీర్, రువా షా గత ఇరవైఏళ్ళుగా
వేర్పాటువాదానికి అండగా నిలిచారు. అలాంటిది, ఇప్పుడు ఒకేసారి వారిలో పరివర్తన
కనిపిస్తోంది. అది నిజమైనదేనా కాదా అన్న అనుమానాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. భారతదేశపు
భద్రతా బలగాల దృష్టిని మరల్చేందుకు వారు వేసిన ఎత్తుగడా, లేక నిజంగానే వారు భారత
అనుకూల వైఖరిని తీసుకున్నారా అన్నది చెప్పడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఏదేమైనా, ఇన్నాళ్ళూ
వేర్పాటువాదులుగా ఉన్నవారు తమ వైఖరిని మార్చుకోవడం ఆసక్తికరమైన పరిణామమే.