ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా అరెస్ట్ చేశారని, బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. బెయిల్ కోసం ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఇక మద్యం కుంభకోణంలో కేసులో దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి కవిత కేసును విచారిస్తామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మెరిట్స్‌లోకి వెళ్లలేమని న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తోంది. కవిత పిటిషన్లో ప్రస్తావించిన అంశాలపై ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో దేశ వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.