Arvind Kejriwal arrested in Delhi Liquor Policy Scam
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసారు. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. మరికొద్దిసేపటికే 12మంది ఈడీ అధికారుల బృందం ఢిల్లీ సీఎం నివాసానికి చేరుకుని ఆయనను అరెస్ట్ చేసారు. ఇది రాజకీయ కుట్ర అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా హాజరవకుండా దాటవేస్తూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసారు. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు పురోగతిలో ఉన్న నేపథ్యంలో కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు నిరాకరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. కోర్టు తీర్పు వచ్చిన కొద్దిసేపటికే ఈడీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని, ఆయనను అరెస్ట్ చేసారు.
మరోవైపు, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర ఉపశమనం కలిగిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ అంశం మీదనే సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.
కేజ్రీవాల్ అరెస్టును రాజకీయ కుట్రగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టులో కుట్రకోణం ఉందని ఆప్ ఎంపీ రాఘవ ఛద్దా అన్నారు. ఎన్నికలకు ముందు ఆప్ గొంతు లేవకుండా చేసేందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి కేంద్రం ప్రయత్నించిందని ఢిల్లీ శాసనసభ స్పీకర్ రాంనివాస్ గోయల్ వ్యాఖ్యానించారు. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి ఏడాది దాటినా ఇప్పటికీ ఇంకా ఏమీ దొరకలేదనీ, అలాగే ఢిల్లీ సీఎం నివాసంలో కూడా ఏమీ దొరకబోవనీ గోయల్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ ఎక్కడున్నా, ఢిల్లీ సీఎంగా ఆయనే కొనసాగుతారని ఆయన మంత్రివర్గ సహచరురాలు ఆతిషీ వెల్లడించారు.