Karnatic Music Artists furious over Sangeetakalanidhi
award to TM Krishna
కర్ణాటక సంగీత కళాకారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా
భావించే పురస్కారం ‘సంగీత కళానిధి’ అవార్డు. అయితే ఈ సంవత్సరం ఆ పురస్కార ప్రకటన
వివాదాలకు దారితీసింది. అవార్డునిచ్చే మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఏటా డిసెంబర్ 15
నుంచి జనవరి 1 వరకూ నిర్వహించే వార్షిక కార్యక్రమంలో ఈ యేడాది పాల్గొనబోమని పలువురు
కళాకారులు ప్రకటించారు.
మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ 2024 సంవత్సరానికి సంగీత
కళానిధి పురస్కారాన్ని టిఎం కృష్ణకు ఇస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.
తోడూరు మాడబూసి కృష్ణ గాత్ర విద్వాంసుడు, రచయిత, సామాజిక కార్యకర్త. కాంగ్రెస్
పార్టీకి చెందిన పాతకాలపు నాయకుడు, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వ్యవస్థాపక సభ్యుల్లో
ఒకరు అయిన టి.టి కృష్ణమాచారికి టిఎం కృష్ణ వరుసకు మనవడు అవుతారు. కులవివక్షపై
పోరాటం పేరిట రాముడి మీద, త్యాగరాజు మీద, ఎంఎస్ సుబ్బులక్ష్మి మీద వివాదాస్పద
వ్యాఖ్యలు చేసారు. ఏసుక్రీస్తు మీద, అల్లా మీద కర్ణాటక సంగీత పద్ధతిలో పాటలు పాడారు.
రాజకీయంగా బీజేపీని తీవ్రంగా విమర్శించే
టిఎం కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు, ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్
వంటి పురస్కారాలెన్నో వచ్చాయి.
టిఎం కృష్ణకు సంగీత కళానిధి బిరుదు ప్రదానం
చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఈ సంవత్సరం మ్యూజిక్ అకాడమీ నిర్వహించే వార్షిక
కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కర్ణాటక సంగీత గాత్రవిదుషీమణులు రంజని-గాయత్రి
ప్రకటించారు. తమ నిర్ణయం గురించి వారు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు.
‘‘2024 సంవత్సరపు మ్యూజిక్ అకాడమీ కాన్ఫరెన్స్‌లో
పాల్గొనకూడదని, డిసెంబర్ 25న కచేరీ చేయకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఆ
నిర్ణయాన్ని అకాడమీకి తెలియజేసాం. మేం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం, ఆ
కాన్ఫరెన్స్‌కు టిఎం కృష్ణ అధ్యక్షత వహించనుండడమే. ఆయన కర్ణాటక సంగీత ప్రపంచానికి
ఉద్దేశపూర్వకంగా అంతులేని నష్టం కలిగించారు. కళాకారుల వర్గపు మనోభావాలను
దెబ్బతీస్తూ సంతోషం ప్రకటించారు. త్యాగరాజస్వామి, ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి అత్యంత
గౌరవనీయులైన శిఖరప్రాయులైన కళాకారులను అవమానించారు. ఆయన తన చర్యల ద్వారా
మిగతావారికి కర్ణాటక సంగీత విద్వాంసులు అని చెప్పుకోడానికి సిగ్గుపడే పరిస్థితి
కల్పించారు. సంగీతంలో ఆధ్యాత్మికతను అప్రతిష్ఠ పాలు చేయడమే లక్ష్యంగా నిరంతరాయంగా
పనిచేసారు. తమ సంగీతం, సాహిత్యం, నిరంతర శ్రమతో కర్ణాటక సంగీతానికి అగణితమైన సేవ
చేసిన వారిని దారుణంగా దూషించి తీవ్రంగా అవమానించారు.
అంతేకాదు, ఈవీ రామస్వామి (పెరియార్) వంటి
వ్యక్తిని టిఎం కృష్ణ గొప్పగా ప్రశంసించడాన్ని విస్మరించడమూ ప్రమాదకరమే. ఈవీఆర్
బహిరంగంగానే బ్రాహ్మణజాతి మొత్తాన్నీ నిర్మూలించాలని ప్రతిపాదించినవాడు. బ్రాహ్మణ
కులానికి చెందిన ప్రతీ మహిళనూ నీచమైన, దుర్మార్గమైన పదజాలంతో పదేపదే తిట్టినవాడు. బ్రాహ్మణ కులానికి చెందిన
వ్యక్తులను బూతులు తిట్టడాన్ని తమిళ సమాజంలో సాధారణీకరణ చేసినవాడు. అలాంటి ఈవీఆర్
భావజాలానికి సమర్థకుడు టిఎం కృష్ణ.
కళను, కళాకారులను, వాగ్గేయకారులను, రసికులను,
వ్యవస్థలను, మన మూలాలను, సంస్కృతిని గౌరవించే విలువలు కలిగి ఉండే వ్యవస్థలో మేం విశ్వాసం
ఉంచుతాం. ఆ విలువలకు పాతర వేసి ఈ యేడాది సదస్సులో పాల్గొంటే మా నైతికతను మేమే
దెబ్బతీసుకున్నవారమవుతాం.’’ అని రంజని-గాయత్రి ద్వయం ప్రకటించారు.
ప్రముఖ వేద విద్వాంసుడు, హరికథా కళాకారుడు
దుష్యంత్ శ్రీధర్ కూడా ఈ యేడాది కార్యక్రమంలో పాల్గొనడం లేదని వెల్లడించారు. 2025
జనవరి 1న హరికథ చెప్పబోనని ప్రకటించారు.
‘‘2024 సంవత్సరానికి సంగీత కళానిధి పురస్కారం
ప్రకటించిన శ్రీ టిఎం కృష్ణతో నాకు భావజాలపరంగా సముద్రమంత విభేదం ఉంది. ఆయనను
పురస్కారానికి ఎంపిక చేయడాన్ని ప్రశ్నించడానికి నాకు అధికారం లేదు. ధర్మం, అయోధ్య,
శ్రీరాముడు ఇంకా అలాంటి చాలా విషయాల గురించి ఆయన చేసిన బహిరంగ ప్రకటనలు నన్ను
ఎంతగానో గాయపరిచాయి. నేను భగవద్రామాజులు, వేదాంత దేశికులు, కంచి పరమాచార్యుల
జీవితాలు, వారి బోధనల అడుగుజాడల్లో నడుస్తున్నవాడిని. కృష్ణగారికి పురస్కారం
ప్రదానం చేసే సభలో ఆ కార్యక్రమం తర్వాత నేను ప్రదర్శన ఇస్తే, అది నా గురువులు
పాటించిన విలువలకు అపచారం చేయడమే అవుతుంది. కాబట్టి 2025 జనవరి 1న హరికథా ప్రదర్శన
ఇవ్వడం నుంచి ఉపసంహరించుకుంటున్నాను’’ అంటూ దుష్యంత్ శ్రీధర్, మద్రాస్ మ్యూజిక్
అకాడెమీ అధ్యక్షుడికి లేఖ రాసారు.
త్రిచూర్ సోదరులుగా పేరు గడించిన శ్రీకృష్ణ మోహన్,
రాంకుమార్ మోహన్ కూడా అటువంటి ప్రకటనే చేసారు. ‘‘మద్రాసు మ్యూజిక్ అకాడమీ 2024 వార్షిక
సదస్సు నుంచి మేం వైదొలగుతున్నాం. దానికి కారణాలు అందరికీ తెలిసినవే. డిసెంబర్ 19న
నిర్ణయించిన మా కచేరీని రద్దు చేసుకుంటున్నాం. మేం విశ్వసించి అనుసరించే మౌలికమైన
విలువలకు పూర్తి విరుద్ధమైన విలువలను టిఎం కృష్ణ పాటిస్తారు, ప్రచారం చేస్తారు. మేము
నమ్మిన విలువలకు కట్టుబడి ఉండడం అనేది మా తల్లిదండ్రులు, గురువులు, రసికులైన
శ్రోతలు, శ్రేయోభిలాషులు, విద్యార్ధులు, కుటుంబానికి మేమిచ్చే గౌరవం. టిఎం కృష్ణ
అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పాల్గొనడం మమ్మల్ని మేము వంచించుకోవడమే అవుతుంది’’
అని వారు ఒక ప్రకటన విడుదల చేసారు.
ప్రముఖ హరికథా కళాకారిణి శ్రీమతి విశాఖ హరి కూడా
మ్యూజిక్ అకాడమీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘‘ఈ యేడాది సంగీత కళానిధి పురస్కారం
ప్రకటించిన వ్యక్తిఎన్నో
అపనిందలకు, దూషణలకు పాల్పడ్డారు. ఎంతోమంది మనోభావాలను ఉద్దేశపూర్వకంగా, దారుణంగా
గాయపరిచారు. సంగీతత్రయ మూర్తులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి
విశ్వసించి, ఆచరించిన విధానం ఒకటే, సంగీతం ఎంత ప్రధానమో విలువలూ అంతే ప్రధానమని
వారు జీవించి చూపించారు. నాదోపాసన అనేది దైవత్వం వైపు చేసే ప్రయాణమే.
సంగీత కళానిధి పురస్కారం పొందిన దివంగత
అరియక్కుడి, సెమ్మంగుడి, లేదా పాల్ఘాట్ మణిఅయ్యర్ వంటివారు జీవించి ఉంటే ఈ
నిర్ణయాన్ని ఒప్పుకునేవారా? ఇప్పుడు బ్రతికిఉన్న పురస్కార గ్రహీతలైనా ఈ
నిర్ణయాన్ని ఆమోదిస్తారా? అవార్డులు వస్తాయి, పోతాయి. కానీ భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా
నిలవడం ముఖ్యం’’ అంటూ తన విశాఖ హరి ఆవేదనను వెళ్ళబోసుకున్నారు.
ఇక 2017లో సంగీతకళానిధి పురస్కారం గెలుచుకున్న
చిత్రవీణ రవికిరణ్ తన పురస్కారాన్ని వెనుకకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి 2018లో తనకు వ్యతిరేకంగా గొడవ జరిగినప్పుడు, అకాడమీ తనకు అండగా
నిలవనప్పుడు సైతం అవార్డును వెనక్కు ఇవ్వాలని అనుకోలేదని, ఇప్పుడు కూడా అహంకారం
వల్లనో, అభద్రత వల్లనో ఈ నిర్ణయం తీసుకోవడం లేదనీ రవికిరణ్ చెప్పుకొచ్చారు.
ఇప్పటికే ఉపయోగించడం మానేసిన బిరుదును వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు
వివరించారు.
‘‘తప్పుడు సమాచారంతో,
అబద్ధాలతో, కొన్నివర్గాల ప్రజలపై దాడులతో… భారతదేశపు శాస్త్రీయ సంగీత నాట్య
కళలను, వాటితో పాటు దేశాన్నీ కులమతాల పేరిట విభజించి అస్థిరపరచాలని నిరంతరాయంగా
ప్రయత్నించిన వ్యక్తిని – కోట్లాది ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ
దేశపు గొప్ప నిర్మాతలను, వ్యవస్థలను, ఇక్కడి సంస్కృతినీ దురుద్దేశపూర్వకంగా అపహాస్యం
చేసిన వ్యక్తిని – శతాబ్దాలుగా ఎన్నో కులాల వారు పెంచిపోషించిన శాస్త్రీయ పరిశ్రమలకు
తన చర్యల ద్వారా జరుగుతున్న తీవ్రనష్టాన్ని ఏమాత్రం పట్టించుకోని బాధ్యతలేని
వ్యక్తిని – గొప్ప విద్వత్తు కలిగిన ఎందరో యువ కళాకారులను తమ జీవితపు కీలకమైన దశలో
అత్యున్నత స్థాయికి చేరుకునేలా అభ్యాసం చేయకుండా తన దుర్మార్గపు అజెండాలకు బలితీసుకున్న
వ్యక్తిని – అకాడమీ ఇవాళ మహానుభావుడిగా చిత్రీకరిస్తుంటే దానిద్వారా అకాడమీ ఎలాంటి
విలువలను ప్రచారం చేస్తోందో అర్ధం చేసుకోలేని అసమర్ధతతో ఈ నిర్ణయం తీసుకున్నాను. వీలైనంత
త్వరలో నా బిరుదు పత్రం, పతకం, బహుమతిగా ఇచ్చిన నగదు మొత్తాన్ని సంస్థకు పంపించేస్తాను’’
అని రవికిరణ్ ఒక లేఖలో ప్రకటించారు.