Centre rejects Rohingyas Right to Stay
మన దేశంలోకి అక్రమంగా చొరబడిన, చొరబడుతున్న రోహింగ్యాల
కంటె దేశ ప్రజలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచంలోనే
అత్యధిక జనాభా కలిగిన, అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌కు ముందు తన ప్రజల ప్రయోజనాలే
ముఖ్యమని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అంతేకాక, దేశంలోకి అక్రమంగా
చొరబడిన రోహింగ్యాల వల్ల జాతీయ భద్రత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తోందని ఆందోళన
వ్యక్తం చేసింది.
ముస్లిం మతానికి చెందిన రోహింగ్యాలు మయన్మార్ నుంచి
భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోకి అక్రమంగా చొరబడుతున్నారు. అలా భారత్‌లోకి
అక్రమంగా చొరబడిన కొంతమంది రోహింగ్యాలను, విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి,
కేంద్రప్రభుత్వం ఇటీవల అదుపులోకి తీసుకుంది. ఆ విషయంలో కేంద్రం వైఖరిని తప్పుపడుతూ
సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానికి సమాధానంగా కేంద్రం సుప్రీంలో
అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్‌లో
కేంద్రం ఈ విషయాలు వెల్లడించింది.
‘‘1951 నాటి
శరణార్థుల ఒప్పందం మీద కానీ, 1967 నాటి శరణార్థుల స్థితిగతులకు సంబంధించిన
ప్రోటోకాల్ మీద కానీ భారతదేశం సంతకం చేయలేదు. అందువల్ల, మన దేశంలో శరణార్థులుగా
ఎవరిని గుర్తించాలన్నది పూర్తిగా మన దేశం విధానపరంగా తీసుకునే నిర్ణయమే’’ అని కేంద్రం
తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
‘‘భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను శరణార్థులుగా
గుర్తిస్తూ, వారికి భారత భూభాగంలో నివసించే హక్కు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్,
రాజ్యాంగంలోని 19వ అధికరణానికి (భావ ప్రకటనా స్వేచ్ఛ) వ్యతిరేకంగా ఉంది. ఆ అధికరణం
కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప విదేశీయులకు దాన్ని ఎట్టి
పరిస్థితుల్లోనూ వర్తింపజేయకూడదు’’ అని కేంద్రం విస్పష్టంగా తెలియజేసింది.
అలాగే చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఏ వర్గానికీ
శరణార్థి హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఒక నిర్దిష్ట వర్గానికి శరణార్థి
హోదా ఇవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశించజాలదని స్పష్టంగా వివరించింది.
‘‘ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న, అభివృద్ధి
చెందుతున్న, వనరులు పరిమితంగా ఉన్న దేశం మనది. అందువల్ల మనదేశంలో మొదటి ప్రాధాన్యం
మన సొంత పౌరులకే ఉంటుంది. అందువల్ల విదేశీయులకు టోకున శరణార్థి హోదా ఇవ్వడం కుదరదు.
అందునా, ఆ విదేశీయుల్లో అత్యధికులు దేశంలోకి అక్రమంగా చొరబడినవారే’’ అని
కేంద్రప్రభుత్వం కుండబద్దలుకొట్టింది.
ఎలాంటి తనిఖీలూ లేకుండా దేశంలోకి చొరబడినవారి
వల్ల తలెత్తే ప్రమాదాల గురించి సుప్రీంకోర్టే 2005లో ఒక తీర్పులో ప్రస్తావించిన
విషయాన్ని కేంద్రప్రభుత్వం ఉటంకించింది. ‘‘రోహింగ్యాలు భారతదేశంలోకి అక్రమంగా
చొరబడ్డారు. అలాంటివారిని దేశంలో ఉండనీయడం కూడా అక్రమమే, చట్టవిరుద్ధమే. అంతేకాదు.
అటువంటి వారిని దేశంలో నివసించనీయడం జాతీయ భద్రతపై తీవ్ర పరిణామాలకు
దారితీస్తుంది. దేశ భద్రతకు ముప్పు కలుగజేస్తుంది’’ అంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం
చేసింది.
భారతదేశానికి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్,
మయన్మార్ తదితర దేశాలతో కంచెలు లేని సరిహద్దులు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్,
శ్రీలంక నుంచి సులువైన సముద్రమార్గమూ ఉంది. అందువల్ల అక్రమ చొరబాట్లు అనేది భారత్
మెడ మీద నిరంతరం వేలాడుతున్న కత్తి. అలాంటి
అక్రమ చొరబాటుదార్ల వల్ల తలెత్తుతున్న సమస్యలు మరో తలనొప్పి.
‘‘ఏదైనా ఒక దేశం నుంచి చొరబడుతున్న వ్యక్తులు
లేదా వ్యక్తుల సముదాయానికి శరణార్థి స్థాయి కల్పించడం జాతీయ భద్రతకు సంబంధించిన
విషయం మాత్రమే కాదు. అటువంటి వ్యక్తులు ఏయే దేశాల నుంచి వస్తున్నారో ఆయా దేశాలతో సంబంధాలను
కొనసాగించడంపై రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లే. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా,
చట్టాల పరిధిని దాటిన అంశాల సంక్లిష్ట సమ్మేళనం ఫలితంగానే అలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత
అంశంలో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున, రోహింగ్యాలకు దేశంలో
నివసించే హక్కు ఇవ్వడం సరైనది కాదు’’ అని కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టంగా తేల్చి
చెప్పింది.
‘‘రోహింగ్యాలు అక్రమంగా చొరబడిన వారు అని
ఒప్పుకున్న తర్వాత 1946 నాటి విదేశీయుల చట్టంలోని అంశాలు వారికి పూర్తిగా
వర్తిస్తాయి. అలా కాకుండా వారికి ఈ దేశంలో నివసించే హక్కు ఉందని ఒప్పుకుంటే ఆ
చట్టం మౌలిక స్వరూపాన్నే ధిక్కరించినట్లవుతుంది’’ అని కూడా వివరించింది.
పిటిషనర్ అభ్యర్ధనను అమల్లోకి తేవాలంటే చట్టాన్ని
తిరగరాయాలి లేదా ఆ మేరకు కొత్త చట్టాన్ని పార్లమెంటు రూపొందించాలి. ఆ రెండూ
న్యాయసమీక్ష పరిధిలోని అంశాలు ఎంతమాత్రం కావు. పైగా, ఆ విధంగా ఒక చట్టాన్ని
చేయాలంటూ కోర్టులు పార్లమెంటును ఆదేశించజాలవు’’ అని అఫిడవిట్ ద్వారా కేంద్రం
సుప్రీంకోర్టుకు తమ వాదనను స్పష్టం చేసింది.