సార్వత్రిక ఎన్నికలు కొద్దిరోజుల్లో ఉండగా కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల నియామకాన్ని నిలిపేయాంటూ దాఖలైన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా చట్టాన్ని నిలిపివేస్తే గందరగోళానికి దారితీస్తుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వారి నియామకాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈసీ స్వతంత్ర వ్యవస్థ. అది ఏ పాలనా యంత్రాంగం కింద పనిచేయడం లేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. కమిషనర్ల నియామకానికి కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టం తప్పని చెప్పలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.