కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిపించే కార్యక్రమంలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో కొందరు కీలక అధికారులను బదిలీ చేసింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసింది. ఎలాంటి పక్షపాతం లేకుండా, హింసకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేందుకే బదిలీలు చేసినట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్, సుఖ్‌బిర్ సింగ్ సింధులతో చర్చించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
గుజరాత్‌లోని చోటా ఉదయ్‌పూర్ , అహ్మదాబాద్ రూరల్ ఎస్పీలు,పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫజిల్‌కా, జలంధర్ రూరల్, మలేకొట్లా జిల్లాల ఎస్‌ఎస్పీలను బదిలీ చేశారు. వీరితోపాటు పశ్చిమబెంగాల్‌లోని డెంకనల్ కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఒడిషాల్లోని కటక్ రూరల్, డియోగర్ ఎస్పీలను కూడా సీఈసీ బదిలీ చేసింది. మార్చి 18న ఐదు రాష్ట్రాల్లోని కొందరు అధికారులను సీఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.