PFI activist arrested in RSS pracharak murder case
కేరళలో రెండేళ్ళ క్రితం జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్
హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇప్పుడు పట్టుబడ్డాడు. పీఎఫ్ఐ సభ్యుడైన షఫీక్ (28)ని
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం అరెస్ట్ చేసింది.
శ్రీనివాసన్ (45) కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్
సంఘ్ ప్రచారక్‌గా ఉండేవారు. ఆయనను 2022 ఏప్రిల్ 16న తన స్వస్థలం పాలక్కాడ్‌లో
దారుణంగా హత్య చేసారు. షఫీక్ అప్పటినుంచీ పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతన్ని ఈ
యేడాది మార్చి 19న కొల్లాం జిల్లా కరునాగప్పల్లి గ్రామంలో ఎన్ఐఏ నిర్బంధించింది.
షఫీక్ మలప్పురం జిల్లాకు చెందినవాడు. అతను,
నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడని, పీఎఫ్ఐ నిర్దిష్టమైన
హత్యలు చేయవలసి వచ్చినప్పుడే అతన్ని వినియోగిస్తుందని అంచనాలున్నాయి.
శ్రీనివాసన్‌ను ఆరుగురు సాయుధుల బృందం
హతమార్చింది. తొలుత ఆ కేసును కేరళ పోలీస్ ప్రత్యేక బృందం విచారించినప్పటికీ,
తర్వాత కేసును ఎన్ఐఏకు అప్పగించింది.
ఎన్ఐఏ ఫిబ్రవరి 12న ఈ కేసులోని సహనిందితులు కెవి
సాహిర్, భీమంతవిడే జాఫర్లను అరెస్ట్ చేసింది. వారి విచారణలో, నిందితుడిని అండర్‌గ్రౌండ్‌కు
పంపివేసిన పీఎఫ్ఐ మద్దతుదారుల వివరాలు తెలిసాయి. దాని ఆధారంగా ఇప్పుడు షఫీక్‌ను
అరెస్ట్ చేసారు.
శ్రీనివాసన్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేసారు.
గతంలో పాలక్కాడ్ జిల్లా శారీరిక్ ప్రముఖ్గానూ ఉండేవారు. హంతకులు 2022 ఏప్రిల్ 16న
పాలక్కాడ్ జిల్లా మేలామూరిలోని ఆయన కార్యాలయంలోకి చొరబడి, పట్టపగలే అతి కిరాతకంగా
చంపేసారు.
షఫీక్ అరెస్ట్ తర్వాత పోలీసులు
అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. శ్రీనివాసన్ హత్యకు దుండగుల బృందాన్ని
రిక్రూట్ చేసుకోవడం, హత్యకు పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చి వారిని దాచి ఉంచడం అనే
ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శ్రీనివాసన్ ఒక్కడినే కాదు, మరికొంతమందిని కూడా ఎంపిక
చేసుకుని, వారిని చంపడానికి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు రచించి, ఆ ప్రణాళికలను కచ్చితంగా
అమలు చేసేవాడంటూ షఫీక్ గురించి ఎన్ఐఏ స్పష్టం చేసింది.
షఫీక్ అరెస్టు కేరళలో
నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాద సంస్థల ప్రభావాన్ని, రాష్ట్ర పోలీసులు తటస్థంగా
పని చేయకుండా ఒక పక్షానికి కొమ్ముకాస్తున్న వైనాన్నీ వెలుగులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో
అధికారంలో ఉన్న సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూడీఎఫ్…
రెండు కూటముల వ్యవహారశైలిని ఎన్ఐఏ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ కూటములు అనుసరిస్తున్న మతఛాందసవాదం, మైనారిటీ బుజ్జగింపు ధోరణి వంటి విధానాలను తీవ్రంగా గమనిస్తున్నారు.
ఈ కేసును ఎన్ఐఏ లోతుగా
తవ్వే ప్రయత్నం చేస్తోంది. శ్రీనివాసన్ లాంటి బాధితులకు న్యాయం, ఉగ్రవాద
కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో ఎన్ఐఏ సఫలం అవాలని కేరళ ప్రజలు
ఆకాంక్షిస్తున్నారు.