India’s first private rocket Agnibaan will be launched on
22 March
భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అంతరిక్ష రంగంలో
పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీ ‘అగ్నికుల్ కాస్మోస్’, అగ్నిబాణ్ అనే రాకెట్‌ను
శ్రీహరికోట నుంచి రోదసిలోకి మార్చి 22న ప్రయోగించనుంది.
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష పరిశోధనల
అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ తమ మొట్టమొదటి రాకెట్ ‘అగ్నిబాణ్’ సబ్-ఆర్బిటల్
టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ను శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి
ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకుంటోంది.
ఈ ‘అగ్నిబాణ్’కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్. భారతదేశంలో మొదటిసారి
సెమీ-క్రయోజెనిక్ ఇంజన్‌తో లాంచ్ అవుతున్న రాకెట్ ఇది. అంతేకాదు, ప్రపంచంలోనే
మొట్టమొదటి సింగిల్‌పీస్-త్రీడీ ప్రింటెడ్-ఇంజన్‌ను దేశీయంగా డిజైన్ చేసి,
తయారుచేసి ఈ రాకెట్ ప్రయోగంలో వాడుతున్నారు.
అగ్నికుల్ కాస్మోస్ సంస్థను శ్రీనాథ్ రవిచంద్రన్,
మొయిన్ ఎస్పిఎం, సత్య చక్రవర్తి కలిసి 2017లో ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో
ఇస్రో అనుభవాన్నీ, ఇస్రోలోని మౌలిక సదుపాయాలనూ ఉపయోగించుకుంటూ ప్రైవేటు రంగంలో
రాకెట్ తయారీకి ఇస్రోతో డిసెంబర్ 2020లో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి దేశీయ
కంపెనీ ఇదే.
అగ్నికుల్ కాస్మోస్ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఐఐటీ
మద్రాస్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ అయిన సత్య చక్రవర్తి ఈ
ప్రాజెక్ట్ గురించి ‘‘ఇది భారతదేశపు మొట్టమొదటి లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ రాకెట్
ఫ్లైట్, మన దేశంలో ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేసిన మొదటి రాకెట్ ఫ్లైట్ కూడా
ఇదే’’ అని చెప్పారు.
‘‘మరీ ముఖ్యంగా, మేము పేటెంట్ చేసుకున్న ‘సింగిల్
పీస్ త్రీడీ ప్రింటెడ్ రాకెట్’ను
ప్రయోగించనున్నాం. ఇది మౌలికంగా ఒక సబ్-ఆర్బిటల్ ఫ్లైట్. అయితే ఇది సౌండింగ్
రాకెట్ మాత్రం కాదు. కొన్ని వేల సిమ్యులేషన్స్ చేసి, లాంచ్‌ప్యాడ్ నుంచి సేఫ్టీ
రేడియస్‌ను లెక్కగట్టాం. మనదేశంలో ఫ్లైట్ టెర్మినేషన్ సిస్టం కావలసిన మొదటి
ప్రైవేట్ స్పేస్ లాంచ్ ఇదే’’ అని సత్య చక్రవర్తి చెప్పారు. ఈ ప్రయోగం తర్వాత
పోస్ట్ ఫ్లైట్ అనాలసిస్ ఉంటుందని, ప్రాజెక్టులోని అన్ని సబ్-సిస్టమ్‌ల పనితీరునూ
విశ్లేషిస్తామనీ వివరించారు. ఆ తర్వాత ఆర్బిటల్ ఫ్లైట్‌కు సిద్ధమవడమే భవిష్యత్
ప్రణాళిక అని చెప్పారు.
అగ్నిబాణ్ నిజానికి భారతదేశంలో
అభివృద్ధి చేసిన రెండవ ప్రైవేట్ రాకెట్. 2022లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్
రాకెట్ విక్రమ్-ఎస్‌ను శ్రీహరికోటలోని ఇస్రో లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించారు.
కానీ, ‘ప్రారంభ్’ అనే పేరుతో చేపట్టిన ఆ మిషన్ విఫలమైంది. హైదరాబాద్‌కు చెందిన
స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ ఆ 6 మీటర్ల పొడవైన రాకెట్‌ను
డెవలప్ చేసింది. ప్రయోగ సమయంలో
విక్రమ్-ఎస్ 89.5 కిలోమీటర్ల పీక్ ఆల్టిట్యూడ్‌కు చేరుకుని, లాంచ్ చేసిన 5
నిమిషాల్లోనే బంగాళాఖాతంలో కుప్పకూలిపోయింది.