DMK announces list of 21 candidates for LS elections, announces manifesto
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, రాబోయే లోక్‌సభ
ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి
ఎంకె స్టాలిన్, 21మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను
కూడా ఆవిష్కరించారు. ఆ సందర్భంగా బీజేపీని దుయ్యబట్టారు.
‘‘ఇది డీఎంకే మ్యానిఫెస్టో మాత్రమే కాదు, ప్రజల
మ్యానిఫెస్టో. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వారు దేశాన్ని నాశనం చేసారు.
ఎన్నికల్లో చేసిన ఒక్క వాగ్దానాన్ని అయినా నెరవేర్చలేదు. మేం ఇండీ కూటమి ఏర్పాటు
చేసాం. 2024లో మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మా మ్యానిఫెస్టోలో తమిళనాడుకు
ప్రత్యేక పథకాలు ప్రకటించాం. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకీ ప్రత్యేకంగా పథకాలు
ప్రకటించాం’’ అని చెప్పారు.
డీఎంకే మ్యానిఫెస్టోలో గవర్నర్ వ్యవస్థను
తొలగించాలని డిమాండ్ చేసారు. అది జరిగేవరకూ, రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించి
గవర్నర్‌ను నియమించాలని డిమాండ్ చేసారు. గవర్నర్లకు నేర విచారణకు మినహాయింపునిచ్చే
రాజ్యాంగ అధికరణం 361ని సవరించాలని డిమాండ్ చేసారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ‘తిరుక్కురళ్’ను
జాతీయ గ్రంథంగా ప్రకటిస్తామన్నారు. జాతీయ విద్యా విధానం, నీట్ పరీక్షా విధానమూ
తమిళనాడులో అమలు చేయబోమన్నారు. సీఏఏ, యూసీసీ కూడా తమిళనాడులో అమలు చేయబోమని
స్టాలిన్ చెప్పారు.
లోక్‌సభకు డీఎంకే మొత్తం 21 స్థానాల్లో పోటీ
చేస్తోంది. ఆ అభ్యర్ధుల జాబితాను ఇవాళ విడుదల చేసింది. వారిలో 12మంది కొత్తవారు.
ఇంక స్టాలిన్ సవతి చెల్లెలు కనిమొళికి తూత్తుక్కుడి టికెట్ దక్కింది.
తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలున్నాయి.
డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ కూటములు పోటీ పడుతున్నాయి. డీఎంకే, ఇండీ కూటమిలో ప్రధాన
భాగస్వామి. ఆ కూటమిలో తమిళనాడులో మొత్తం 8 పార్టీలున్నాయి. వాటి మధ్య సీట్ల
సర్దుబాటు పూర్తయింది.
డీఎంకే 21 స్థానాల్లో పోటీ
చేస్తుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో బరిలోకి దిగుతుంది. వీసీకే, సీపీఎం, సీపీఐ చెరో
రెండు సీట్లలోనూ పోటీ పడతాయి. ముస్లింలీగ్, కేఎండీకే, ఎండీఎంకే తలా ఒక స్థానంలో
పోటీ చేస్తాయి.