సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై దాఖలైన ప్రజా ప్రయోజ వ్యాఖ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. త్వరలో ఈ కేసును లిస్ట్ చేస్తామని ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తులు రద్దు చేయాలని, అలాంటి పార్టీల రిజిస్ట్రేషన్ తీసేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించాలంటూ పిటిషనర్ పిల్లో కోరారు.
ఉచిత హామీలపై దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పరిశీలించింది. ఎన్నికల కంటే ముందే విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యమైన అంశంగా పరిగణించి, రేపు బోర్డు ముందు ఉంచనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.