Unnecessary Controversy over Zomato Pure Veg Fleet
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో వివాదాల్లో
చిక్కుకుంది. పూర్తి శాకాహారం ఆర్డర్ల డెలివరీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు
చేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిగంటల్లోనే సోషల్ మీడియాలో ఆ సంస్థపై దుష్ప్రచారం
ప్రారంభమైంది. దాంతో ఆ సంస్థ ఒకడుగు వెనక్కు వేసింది.
జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ మంగళవారం మధ్యాహ్నం ‘ప్యూర్
వెజ్ మోడ్’ అనే కొత్త సేవను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి శాకాహారుల
కోసం కేవలం శాకాహారం వండే హోటళ్ళ నుంచే ఆర్డర్లు తీసుకోవడం ఆ సేవ ప్రత్యేకత. అంతేకాదు,
ఆ సర్వీస్ అందించే డెలివరీ బోయ్స్కి ఆకుపచ్చ రంగులో ప్రత్యేకమైన దుస్తులు, అదే
రంగులో డెలివరీ బాక్స్‌లు కూడా రూపొందించారు.
శాకాహార డెలివరీల కోసం ప్రత్యేకంగా సేవలు
అందించాల్సిన అవసరం గురించి దీపీందర్ గోయల్ వివరించారు. ‘‘ఎన్ని జాగ్రత్తలు
తీసుకున్నా, డెలివరీ బాక్సుల్లో ఆహార పదార్ధాలు ఒలికిపోతుంటాయి. దానివల్ల ఫుడ్
బాక్స్‌ల వాసన ఒకదానిది మరోదానికి అంటుకుంటుంది. అందువల్ల మాత్రమే వెజిటేరియన్
ఆర్డర్లకు డెలివరీ ఫ్లీట్‌ను విడదీసాం’’ అని గోయల్ వివరణ ఇచ్చారు.
అయితే దీనిపై సోషల్ మీడియాలో అనవసరమైన రచ్చ
జరిగింది. తిండి ఆధారంగా వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వినియోగదారుల
ఆహారపు ప్రాధమ్యాలను బట్టి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ను విభజించడం సమాజంలో
అసమానతలకు దారి తీస్తుందంటూ లేనిపోని అపోహలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
భారతదేశంలో కేవలం పది శాతం లోపే శాకాహారులు ఉన్నారు, వారిని మంచిచేసుకోవడం కోసం
మిగతా 90శాతం మంది మాంసాహారుల మనోభావాలను దెబ్బతీసారు అంటూ విపరీత వ్యాఖ్యానాలు
చేసారు. పూర్తి శాకాహార డెలివరీలకు ఆకుపచ్చ డ్రెస్ కేటాయించడం వల్ల, ఎరుపు రంగు
డ్రెస్ ధరించే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లపై శాకాహారులు దాడులు చేస్తారన్న పనికిమాలిన
ప్రచారం కూడా జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఒక్కపూటలోనే జొమాటో మరో నిర్ణయం
తీసుకుంది. పూర్తి శాకాహార భోజనపదార్ధాలు డెలివరీ చేసేవారికి ఆకుపచ్చ యూనిఫాం
నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అందరూ ఎరుపు యూనిఫాంలోనే ఉంటారని ప్రకటించింది.
అయితే ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని వెల్లడించింది. తమ
వినియోగదారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, అంతేతప్ప
తమ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని స్పష్టం చేసారు.