సార్వత్రిక ఎన్నికల అంకంలో తొలి దఫా జరిగే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్లైంది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు మార్చి 27 వరకు నామినేషన్లు వేయవచ్చు. 28న పరిశీలన చేస్తారు. 30వ తేదీలోగా ఉపసంహరణలకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 19న 102 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
తమిళనాడులో 39, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, రాజస్థాన్‌లోని 12, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల్లో 4 చొప్పున, పశ్చిమబెంగాల్లోని 2, మణిపుర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు తొలి విడత జరగనున్నాయి. ఇక మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో ఎంపీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు.