Judicial Custody of Manish Sisodia Extended in Delhi
Liquor Case
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా
జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్ట్ ఏప్రిల్ 6 వరకూ పొడిగించింది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో తదుపరి విచారణ ఆరోజు జరగనుంది. ఆ కేసులో ఇవాళ జరిగిన
విచారణకు ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హాజరయ్యారు.
మనీష్ సిసోడియా ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు
చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్ధనను సీబీఐ సోమవారం నాడు వ్యతిరేకించింది. ఈ కేసుకు
సంబంధించి కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులు అరెస్ట్ అయే అవకాశం ఉందని
న్యాయస్థానానికి వెల్లడించింది. ఆ కేసులో విచారణ జరుగుతోందని, ఇలాంటి సమయంలో నిందితుడికి
బెయిల్ మంజూరు చేస్తే అది విచారణను దెబ్బతీస్తుందనీ సీబీఐ కోర్టుకు విన్నవించింది.
సిసోడియాకు బెయిల్ విషయమై ఆయన తరఫున సీనియర్
న్యాయవాది మాథుర్ వాదించారు. ‘ఆ కేసులో ఖజానాకు ఒక్కరూపాయి నష్టం కలగలేదు, పైగా
లాభం మాత్రం కలిగింది. ఏ వ్యక్తికి గానీ, ఏ వినియోగదారుడికి గానీ నష్టం కలగలేదు. అలాంటి
కేసులో బెయిల్ ఇవ్వకపోవడం ఏంటి?’ అని వాదించారు.
మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయకూడదంటూ
అడిషనల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పంకజ్ గుప్తా వాదించారు. ‘మా వైపు నుంచి ఎలాంటి
జాప్యమూ లేదు. వాదనలు ముగిసిన తర్వాతే ట్రయల్ మొదలవుతుంది. కానీ వాదనలను సాగదీస్తూ
ట్రయల్‌ను ఆలస్యం చేస్తున్నది నిందితుడే’ అని వివరించారు. ఆ కేసులో దర్యాప్తు ఇంకా
కొనసాగుతోందనీ, కొంతమంది ఉన్నతస్థాయి వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశముందనీ
చెప్పారు. ఆ దశలో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే అతను సాక్షులను ప్రభావితం చేసే
అవకాశముందనీ, దానివల్ల విచారణ దెబ్బతింటుందనీ పంకజ్ గుప్తా వాదించారు.
ఆ నేపథ్యంలో, ఇవాళ న్యాయస్థానం మనీష్ సిసోడియా జ్యుడీషియల్
కస్టడీని ఏప్రిల్ 6 వరకూ పొడిగించింది.
ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ, కవిత ఆప్ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్
సిసోడియాతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్
కేజ్రీవాల్ పేరును ఈ కేసులో కుట్రదారుడిగా వెల్లడించడం ఇదే మొదటిసారి.