Former Indian Envoy to US joins BJP
అమెరికాలో భారతదేశపు మాజీ రాయబారి తరణ్‌జీత్
సింగ్ సంధూ ఇవాళ బీజేపీలో చేరారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సంధూ,
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మన్జిందర్ సింగ్ సిర్సా,
తరుణ్ఛుగ్ల సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు.
ఆ సందర్భంలో తరణ్‌జీత్ సింగ్ సంధూ మాట్లాడుతూ,
మోదీ అభివృద్ధి కేంద్రకంగా పనిచేసే నాయకుడనీ, ఆ అభివృద్ధి తన స్వస్థలమైన అమృత్సర్లోనూ
కనబడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
‘‘గత పదేళ్ళలో నేను ప్రధానమంత్రి మోదీ
నాయకత్వానికి సన్నిహితంగా పనిచేసాను. ప్రత్యేకించి అమెరికా, శ్రీలంక దేశాలతో
సంబంధాల విషయంలో నేను పనిచేసాను. మోదీ దృష్టి అంతా అభివృద్ధి కేంద్రంగా ఉంటుంది. ఇవాళ
దేశానికి కావలసింది అదే’’ అని సంధూ వివరించారు.
‘‘గత నాలుగేళ్ళలో భారత్-అమెరికా సంబంధాల్లో గణనీయమైన
మార్పు వచ్చింది. అది సంబంధం నుంచి భాగస్వామ్యంగా మారింది. భారతదేశానికి ఎన్నో
రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. యువతకు అవకాశాలు సృష్టించబడ్డాయి. మన దేశానికి
వస్తున్న ఆ అవకాశాలను అమృత్సర్ కోల్పోకూడదని నా ఉద్దేశం…. ఇక నా విషయానికి
వస్తే, ఎన్నికల్లో నేను పోటీ చేయాలా వద్దా అనే విషయం పార్టీ నిర్ణయిస్తుంది’’ అని
చెప్పారు.
తరణ్జీ సింగ్ సంధూ అమెరికాలో భారత రాయబారిగా
ఫిబ్రవరి 1న రిటైర్ అయ్యారు. ఆయన 2020 నుంచీ అమెరికాలో భారత రాయబారిగా పనిచేసారు.
అమెరికా వ్యవహారాల్లో అత్యంత అనుభవం ఉన్న కొద్దిమంది భారతీయ రాయబారుల్లో సంధూ
ఒకరు. శ్రీలంక, జర్మనీ దేశాల్లోనూ ఆయన పనిచేసారు. అంతకంటె ముందు విదేశాంగశాఖలో వివిధ
స్థాయుల్లో పనిచేసారు.
పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 13 లోక్‌సభ
స్థానాలున్నాయి. ఆ నియోజకవర్గాలకుబీజేపీ,
కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ఇంకా ప్రకటించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 8మంది అభ్యర్ధుల
పేర్లను ప్రకటించింది. వారిలో ఐదుగురు ప్రస్తుత పంజాబ్ ప్రభుత్వంలో మంత్రులుగా
ఉన్నవారే. ఆ రాష్ట్రంలో ఎన్నికలు, ఆఖరిదైన ఏడవ దశలో అంటే జూన్ 1న జరుగుతాయి.