Supreme refuses to issue stay on CAA, orders centre to
respond in 3 weeks
పౌరసత్వ సవరణ చట్టం – సీఏఏ అమలుపై స్టే
విధించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీఏఏను అమల్లోకి తీసుకురావడాన్ని
వ్యతిరేకిస్తూ దాఖలైన 237 పిటిషన్లపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దానికి
మూడు వారాలు, అంటే ఏప్రిల్ 8 వరకూ గడువునిచ్చింది.
సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా కేంద్రప్రభుత్వం
ఎవరికైనా పౌరసత్వం ఇస్తే పిటిషనర్లు తమ వద్దకు రావచ్చని సుప్రీంకోర్టు సూచించింది.
సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తి మేరకు
సుప్రీంకోర్టు ఆ సూచన చేసింది. దానిపై తాను ఏ ప్రకటనా చేయబోనని ప్రభుత్వం తరఫున
వాదించిన సొలిసిటిర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.
తుషార్ మెహతా నిజానికి, పిటిషన్లపై స్పందించేందుకు
కేంద్రప్రభుత్వానికి నాలుగు వారాల గడువు కావాలని సుప్రీంకోర్టును కోరారు. ‘‘మేము
అఫిడవిట్‌ను సవివరంగా ఫైల్ చేయాలి. 237 పిటిషన్లు, 20 మధ్యంతర దరఖాస్తులు ఇప్పటికే
దాఖలు చేసారు. ఇంకా ఎన్నో అఫిడవిట్లు దాఖలు చేస్తారు. అవన్నీ చూసుకుంటూ
స్పందించడానికి, వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే కనీసం నాలుగు వారాలు పడుతుంది’’ అని
ఆయన చెప్పారు.
సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన 237 పిటిషన్లను
సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్,
జస్టిస్ జేబీ పార్దీవాలా, మరో న్యాయమూర్తి మనోజ్ మిశ్రా ఈ కేసు హియరింగ్‌లో
పాల్గొన్నారు. తదుపరి విచారణ ఏప్రిల్ 9న జరుగుతుంది.
సీఏఏ వివక్షాపూరితంగా ఉందని పిటిషనర్లు
వాదిస్తున్నారు. వారి వాదన ప్రకారం సీఏఏ ముస్లిములకు వ్యతిరేకం. పిటిషన్ల
అధ్యయనానికి మరింత సమయం కావాలన్న కేంద్ర వాదనను వారు నిరాకరించలేదు. అయితే, అమలుపై
స్టే విధించమని కోరారు.