లోక్సభ
ఎన్నికల మేనిఫెస్టో-2024కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం
తెలిపింది. మేనిఫెస్టోపై మూడున్నర గంటలకుపైగా చర్చించిన అగ్రనేతలు
25 గ్యారంటీలకు ఆమోదం తెలిపారు. ‘పాంచ్
న్యాయ్’ పేరిట ఒక్కో న్యాయ్ లో అయిదు అంశాలతో మొత్తం 25 హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
కాంగ్రెస్
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ చర్చలో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలు
పాల్గొన్నారు.
భాగిదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్
న్యాయ్, యువ న్యాయ్ పేరిట కాంగ్రెస్ వాగ్దానాలు ప్రకటించారు.
హిస్సేదారి
న్యాయ్ లో భాగంగా సామాజిక, ఆర్థిక కుల గణన చేపట్టడంతో పాటు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50 శాతం సీలింగ్ తొలగిస్తామని
మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్
బడ్జెట్, జల్ జంగల్ జమీన్ పై చట్టబద్ధహక్కులతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను
షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
తమకు
అధికారం ఇస్తే కిసాన్ న్యాయ్ లో భాగంగా స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పనకు చట్టబద్ధత, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామని
మేనిఫెస్టోలో పేర్కొంది. నెల రోజుల్లో పంట బీమా పరిహారం చెల్లింపు, రైతులకు మేలు చేసే ఎగుమతి దిగుమతి
విధానం, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు కల్పిస్తామని మేనిఫెస్టోలో
పేర్కొన్న వివరాలను కాంగ్రెస్ నేతలు వివరించారు.
శ్రామిక్
న్యాయ్ లో భాగంగా రైట్ టు హెల్త్ చట్టం తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్, రోజుకు 400 రూపాయల కనీస వేతనం కల్పిస్తామని పేర్కొంది.
పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని
వెల్లడించింది.
యువ
న్యాయ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో 30
లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్, పేపర్ లీక్ ఘటనలకు అడ్డుకట్ట
వేసేందుకు కఠినమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పింది. అప్రెంటీస్ విద్యార్థులకు
నెలకు రూ. 8,500 అందజేస్తామంది. స్టార్టప్ల్ లను ప్రొత్సహించేందుకు రూ. 5 వేల
కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
నారీ
న్యాయ్ లో భాగంగా మహిళలను ఆకట్టుకునే పలు హామీలను కాంగ్రెస్ పార్టీ గుప్పించింది. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం
అందజేస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు . ఆశ అంగన్వాడి మిడ్ డే మీల్ వర్కర్స్కు
డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ కల్పిస్తామని చెప్పింది.