Pasupati Paras resigns to minister post, RLJSP out of NDA
కేంద్ర మంత్రి పదవికి పశుపతి పారస్ రాజీనామా
చేసారు. తన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి
నుంచి వైదొలగుతున్నట్లు కూడా ప్రకటించారు. బిహార్‌లో ఆర్ఎల్‌డీని కాదని బీజేపీ,
లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)తో పొత్తు పెట్టుకోవడమే దానికి కారణం.
త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ,
బిహార్‌లో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును సోమవారం రాత్రి ప్రకటించింది. వాటిలో,
రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దివంగత నేత
రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీని
(ఎల్‌జేపీ) మాత్రం కలుపుకుంది. పైగా, పశుపతి పారస్ స్థానాన్ని కూడా ఎల్‌జేపీకే
కట్టబెట్టింది. దాంతో పశుపతి పారస్‌కు గత్యంతరం లేకపోయింది. పశుపతి, రాంవిలాస్
పాశ్వాన్ సోదరుడు, చిరాగ్ పాశ్వాన్‌కు బాబాయి అవుతారు.
‘‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, తమ
పొత్తులను ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నా కృతజ్ఞతలు. నాకు, నా
పార్టీకి అన్యాయం జరిగింది. అందుకే మంత్రిగా రాజీనామా చేస్తున్నాను’’ అని పారస్
ప్రకటించారు.
పారస్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన స్థానం
హాజీపూర్ నుంచి పోటీ చేసి తీరతానని ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ, ఆర్ఎల్‌జేఎస్‌పీ
సంబంధాలు బలహీనపడుతున్నాయన్న వార్తలు కొద్దికాలంగా వస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో,
తన పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ అవే స్థానాల నుంచి మళ్ళీ పోటీ చేస్తామని పారస్ సుమారు
పది రోజుల క్రితమే ప్రకటించారు. ‘మా పార్టీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి
స్వేచ్ఛ లభించింది’ అని పారస్ అప్పుడే వ్యాఖ్యానించారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పశుపతి పారస్ ఏ
పార్టీతో పొత్తు పెట్టుకుంటామనడం లేదు. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్-ఆర్‌జేడీ కూటమిలో
కానీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో కానీ చేరతామన్న మాట
చెప్పడం లేదు. తమ పార్టీ ఎటైనా వెళ్ళడానికి దారులు మాత్రం సిద్ధంగా ఉంచుకున్నారు.
లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్
పాశ్వాన్ 2020 అక్టోబర్‌లో చనిపోయారు. అప్పటికి ఆయన పార్టీ ఎన్డీయేలో ఉండేది. పాశ్వాన్
మరణం తర్వాత ఆయన సోదరుడు పశుపతి పారస్, కుమారుడు చిరాగ్ పాశ్వాన్ మధ్య విభేదాలు
తలెత్తాయి. ఆ నేపథ్యంలో పశుపతి పారస్ రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ (ఆర్ఎల్‌జెఎస్‌పి)
పేరిట అక్టోబర్ 2021లో సొంత పార్టీ ప్రారంభించారు. ఆ సమయంలో ఎన్డీయేలో చేరారు.
ఇప్పుడు మాత్రం బీజేపీ, చిరాగ్ పాశ్వాన్
నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ వైపు మొగ్గు చూపింది. బిహార్‌లోని దళిత
ఓటుబ్యాంకుపై చిరాగ్ పాశ్వాన్‌కు పూర్తి పట్టు ఉందని బీజేపీ భావిస్తోంది. ఆ
పార్టీకి సుమారు 6శాతం ఓటుబ్యాంకు నికరంగా ఉంది.
బీజేపీకి సమస్య ఏంటంటే…. ఇప్పుడు ఎన్డీయేలో
భాగస్వాములుగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌లకు
ఒకరంటే ఒకరికి పడదు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో
పోటీ చేసి కేవలం 43 సీట్లలో మాత్రమే గెలిచింది. దానికి కారణం చిరాగ్ నేతృత్వంలోని
ఎల్‌జేపీయే అని నితీష్ కుమార్ భావన. ఆ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74
సీట్లలో విజయం సాధించింది. తద్వారా జేడీయూ కంటె పైచేయి సాధించింది.
ఇప్పుడు లోక్‌సభ
ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. జేడీయూకు 16 సీట్లు కేటాయించింది.
ఇక చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్‌జేపీకి 5, జీతన్‌రాం మాంఝీ నాయకత్వంలోని
హిందుస్తాన్ అవామ్ మోర్చాకు (హెచ్ఏఎం) 1, ఉపేంద్ర కుశ్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ
లోక్మోర్చాకు (ఆర్ఎల్ఎం) 1
సీటు కేటాయించింది.