పల్నాడులోని
బొప్పూడిలో ఎన్డీయే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై
బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా
వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్
కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
ప్రధాని
ముఖ్య అతిథిగా హాజరయ్యే సభకు లక్షలాది మంది జనం హాజరవుతారని తెలిసి కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం
చేశారు.
విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ పాలరాజు,
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను తక్షణం విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
హెలీప్యాడ్
వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికే వారి పేర్లు ముందే అందజేసినా వారిని
అనుమతించలేదని, బొకేలు, శాలువలు కూడా తీసుకెళ్ళకుండా అడ్డుకున్నారని, దేవుడి
బొమ్మలను పక్కన పడేశారని బీజేపీ నేత పాతూరు నాగభూషణం అన్నారు. సభకు
లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా క్రౌడ్ ను మేనేజ్ చేయడంలో పోలీసు
ఉన్నతాధికారులు అలసత్వం వహించారని కూటమి నేతలు మండిపడుతున్నారు.
మార్చి 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడిలో ఎన్డీయే ఆధ్వర్యంలో
ప్రజాగళం సభ నిర్వహించగా ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ జాతీయ
అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ముఖ్యనేతలు ఈ సభకు
హాజరయ్యారు. తగిన బందోబస్తు కల్పించడంలో పోలీసులు
విఫలమయ్యారు.
ప్రధాన
వేదిక ముందు తొక్కిసలాటతో పాటు మైక్ సిస్టమ్ వద్దకు కార్యకర్తలు చొచ్చుకు వచ్చినా
అడ్డుకోలేదని కూటమి నేతలు ఆరోపించారు.
ఎన్డీయే సభను భగ్నం చేసేందుకు జరిగిన
కుట్రలో కొందరు పోలీసులు పాత్రదారులుగా మారారని చెబుతున్నారు.
వీవీఐపీ,
వీఐపీ, సామాన్యులకు వేర్వురు ప్రవేశ మార్గాలు ఉన్నప్పటికీ అందరినీ ఒకే మార్గం
గుండా అనుమతించడం వెనుక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ
పోలీసులు, వైసీపీకే కొమ్ముకాస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రధాని
నరేంద్ర మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా
పలుసార్లు మైక్ కట్ అయింది. కార్యకర్తలంతా ప్రధాన వేదిక వైపు తొసుకొచ్చారు. ప్రధాని
మాట్లాడుతుండగా మైక్ సిస్టమ్ వైపు జనం చొచ్చుకురావడంతో మైక్ మొరాయించింది. దీనిపై
ప్రధాని కూడా అసహనం వ్యక్తం చేశారు. అతి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు.
క్రౌడ్ ను కంట్రోల్ చేయాలని పోలీసులకు సూచించారు.
ప్రధాని
హాజరైన సభను భగ్నం చేయడం ద్వారా ఎన్డీయే కూటమి మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని
వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఆరోపిస్తోంది.
ప్రధాని మోదీ, సభ నుంచి వెళ్ళకముందే
జనం వేదికపైకి రావడంతో కాసేపు గందరగోళం
ఏర్పడింది.
సభ
ప్రారంభానికి ముందే ఎస్పీజీ సిబ్బంది గ్రౌండ్ ను ఆధీనంలోకి తీసుకుని భద్రతా వైఫల్యాలు
గుర్తించారు. స్థానిక పోలీసులకు పలు సూచనలు చేసి బందోబస్తును పటిష్ఠం చేయాలని
కోరారు. కానీ స్థానిక అధికారులు సహకరించలేదని కూటమి నేతలు చెబుతున్నారు. స్థానిక
అధికారుల వైఫల్యంతో ప్రధాని భద్రతా సిబ్బంది హైరానా పడింది. ఉరుకులు, పరుగులు పెడుతూ
ప్రధానికి రక్షణకవచంగా నిలిచారు.
సభ
లో భద్రతా వైఫల్యంలో నిఘా వర్గాల నుంచి అందిన నివేదిక మేరకు పల్నాడు ఎస్పీ రవిశంకర్ నుంచి
విధుల నుంచి తొలగించబోతున్నట్లు సమాచారం.