PMK joins NDA ahead of Lok Sabha polls
తమిళనాడు రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది.
భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆ పార్టీ నేతృత్వంలోని
ఎన్డీయేకు ప్రజాదరణ పెరుగుతోంది. దాంతో తాజాగా పీఎంకే పార్టీ ఎన్డీయే కూటమిలో
చేరింది.
పీఎంకే ఇంతకుముందు అన్నాడీఎంకేతో పొత్తులో ఉండేది.
అయితే ప్రస్తుత ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఎవరితో చేతులు కలపాలా అని తీవ్రంగా
ఆలోచించింది. అన్నాడీఎంకేతో పాటు బీజేపీ, డీఎంకే పార్టీలతో కూడా విస్తతంగా చర్చలు జరిపింది.
చివరికి ఎన్డీయేలో చేరింది.
పట్టాళి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీని డాక్టర్
ఎస్ రాందాస్ 1980లలో స్థాపించారు. అప్పటినుంచీ ఆ పార్టీ వ్యూహాత్మకంగా వివిధ
పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ వస్తోంది. సీట్ల కేటాయింపులోనూ, ప్రభుత్వం
ఏర్పాటులో మంత్రివర్గంలో స్థానాల విషయంలోనూ డిమాండ్లు చేయడంలో పీఎంకేకు ఘనమైన
చరిత్రే ఉంది. ఆ నేపథ్యంలో ఎన్డీయేలో పీఎంకే చేరిక ఆసక్తి కలిగించే పరిణామమే.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీఎంకే తొలుత
తమ మిత్రపక్షం అన్నాడీఎంకేతో చర్చలు జరిపింది. పీఎంకే అడిగినన్ని లోక్‌సభ, రాజ్యసభ
స్థానాలు ఇవ్వడానికి అన్నాడీఎంకే కూడా అంగీకరించింది. ఐనా పీఎంకే చివరికి
ఎన్డీయేలోనే చేరింది. తమ పార్టీ ఎదుగుదల, భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొనే,
పీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది.
పీఎంకే ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్, తమ
పార్టీ ఎన్డీయేలో చేరిన విషయాన్ని ధ్రువీకరించారు. సీట్ల సర్దుబాటు చర్చలు చివరి
దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు, తమ పార్టీ త్వరలో సేలంలో నిర్వహించే బహిరంగ
సభలో అన్బుమణి రాందాస్‌తో పాటు ప్రదానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనే
అవకాశముందని సూచించారు.
బీజేపీతో చేతులు కలపాలన్న నిర్ణయంపై పీఎంకేలో
భిన్నాభిప్రాయాలు లేవు అనలేము. పార్టీ నాయకుల్లో పలువురు అన్నాడీఎంకే లేదా డీఎంకేతో
పొత్తు కుదుర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. కానీ అన్బుమణి రాందాస్ మాత్రం బీజేపీతో
పొత్తుకే పట్టుపట్టారు. భవిష్యత్ రాజకీయ అవసరాలు, పార్టీ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని
ఆ నిర్ణయం తీసుకున్నామని అన్బుమణి చెప్పారు.
అన్బుమణి రాందాస్ మీడియాతో మాట్లాడుతూ ‘‘దేశ ప్రయోజనాల
కోసం, ప్రధాని మోదీ పరిపాలన కొనసాగాల్సిన అవసరం కోసం, మేం ఎన్డీయేలో చేరాలని
నిర్ణయించుకున్నాం. తమిళనాడులో మాత్రమే కాదు, దేశం అంతటా విజయం సాధించాలి, తద్వారా
ప్రధాని మోదీ మూడోసారి గద్దెనెక్కాలన్నదే మా కూటమి లక్ష్యం’’ అని చెప్పారు.
ఎన్డీయే కూటమిలో పీఎంకే చేరడం రాబోయే ఎన్నికల్లో
గణనీయమైన ప్రభావమే చూపే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి పీఎంకేకు తమిళనాడు ఉత్తర
ప్రాంతంలో వన్నియార్ సామాజికవర్గంలో బలమైన పట్టు ఉంది. నికరంగా 6 నుంచి 7శాతం
ఓటుబ్యాంకు ఉన్న పీఎంకే, ఎన్డీయేలో చేరడం వల్ల తమిళనాట బీజేపీ బలం పెరిగే అవకాశాలు
మెండుగానే ఉన్నాయి.
ఇప్పటికే జీకే వాసన్‌కు చెందిన తమిళ మానిల
కాంగ్రెస్ (టీఎంసీ), టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం
(ఎఎంఎంకె), అన్నాడీఎంకే రెబెల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గం ఎన్డీయే కూటమిలో
ఉన్నాయి. ఈ సంకీర్ణం రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల మద్దతును కూడగట్టడంలో
విజయవంతమవుతుందనీ, తద్వారా ఎన్డీయే తమిళనాడులో మెరుగైన ప్రదర్శన చేయవచ్చనీ
అంచనాలున్నాయి.