Kavitha
withdraws Writ Petition in Delhi Liquor Case
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో
నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు
కుమార్తె కల్వకుంట్ల కవిత, తనకు ఈడీ సమన్ల జారీపై సుప్రీంకోర్టులో వేసిన రిట్
పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ కవితను ఈ నెల 15న అరెస్టు చేసింది. దాంతో, సమన్ల జారీపై రిట్ పిటిషన్
మీద విచారణ అవసరం లేనందున ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కవిత తరఫు
న్యాయవాది విక్రమ్ చౌధరి న్యాయస్థానానికి వెల్లడించారు. చట్టప్రకారం ఉపశమనం
పొందేందుకు తదుపరి చర్యలకు వెడతామని ఆయన కోర్టుకు తెలియజేసారు. దానికి జస్టిస్
బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది.
ఈ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ
చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత గతేడాది మార్చిలో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. అయితే కవిత
అరెస్ట్ నేపథ్యంలో ఆ రిట్ పిటిషన్‌పై విచారణ ఇక అవసరం లేదని కవిత తరఫు న్యాయవాది
వివరించారు. మరోవైపు, కవిత అరెస్ట్ తర్వాత ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది.
కవిత తమ పార్టీ నేతలకు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారంటూ ఈడీ చేసిన ఆరోపణను
ఖండించింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ నేత
అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈడీ నిరాధార ఆరోపణలు చేస్తోందని
ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజకీయ పక్షంలా
పని చేస్తోందని దుయ్యబట్టింది.
‘ఈ కేసులో 500కు పైగా సోదాలు చేసినా,
వేలమంది సాక్షులను విచారించినా, ఈడీ ఒక్క రూపాయి డబ్బు కానీ, ఒక్క సాక్ష్యాన్ని
కానీ రికవరీ చేయలేకపోయింది, అయినా ఇలాంటి నిరాధార ప్రకటనలు చేస్తూనే ఉంది. కీలకమైన
లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్, సిసోడియాల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈడీ
రాజకీయ ప్రకటనలు చేస్తోంది’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.