హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అనర్హత వేటు పడిన మాజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందన తెలపాలని కోరింది.
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించ వద్దని, సభలో ఓటు హక్కు కల్పించ వద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అనర్హత వేటు పడిన ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ ప్రకటన నేపథ్యంలో తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది.