Ghar Wapsi in Chattisgarh, hundreds revert to Sanatan
Dharm
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో ఆదివారం
నిర్వహించిన ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా సుమారు 2వందల మంది ‘పహాడీ కొరవ’ అనే
తెగకు చెందిన వనవాసీలు సనాతన ధర్మంలోకి మళ్ళీ వచ్చారు.
రాయగఢ్ జిల్లా ధర్మజయగఢ్ చేరువలోని కుమార్తా పంచాయతీలోని
బార్ఘాట్ గ్రామానికి చెందిన వందలమంది ఆదివాసీలు తమ సంప్రదాయిక విల్లమ్ములు
పట్టుకుని స్వధర్మంలోకి వచ్చేసారు. వేదమంత్రాల ఉచ్చారణల మధ్య వారు ప్రపంచంలోని అతి
పురాతనమైన ధర్మంలోకి మళ్ళీ వచ్చారు. అత్యంత నిరుపేద ప్రాంతానికి చెందిన ఈ ప్రజలు
కొన్నాళ్ళ క్రితమే క్రైస్తవ మతంలోకి మారారు.
స్థానిక బీజేపీ సీనియర్ నేత ప్రభల్ ప్రతాప్ జుదేవ్
ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా క్రైస్తవం నుంచి
తిరిగి హిందూధర్మంలోకి వచ్చిన వనవాసీల కాళ్ళను ప్రభత్ ప్రతాప్ వేదమంత్రాల మధ్య
గంగాజలంతో కడిగారు.
జష్‌పూర్ రాజకుటుంబానికి చెందిన వారసుడు జుదేవ్,
ఆ సందర్భంలో ప్రసంగించారు. అక్రమ మతమార్పిడులను ఇంకెంత మాత్రం సహించబోమన్నారు.
అటువంటి పనులు చేసేవారు వాటి దుష్ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని
సూచించారు. మతమార్పిడి దురాగతాన్ని ఆపకపోతే భావితరాలు మనమెవరో మరచిపోవడం ఖాయం
అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన
మత మార్పిడులపై దర్యాప్తు జరపాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసారు.
ఆయన ఛత్తీస్‌గఢ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్నేళ్ళుగా అఖిల భారతీయ ఘర్‌వాపసీ
అభియాన్’’ నిర్వహిస్తున్నాడు.
భారతీయ సంస్కృతిని విదేశీ కుట్రలు, ఆక్రమణదారుల
నుంచి రక్షించినది షెడ్యూల్డు తెగల ప్రజలేనని జుదేవ్ వివరించారు. వారే భారతమాతకు
అసలైన సైనికులు అని వ్యాఖ్యానించారు. వనవాసీలను మతం మార్చి, వారిని బలహీనులను
చేయడానికి విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పన్నాయనీ, వారిని తిరిగి స్వధర్మంలోకి
తీసుకొచ్చామనీ జుదేవ్ చెప్పారు.