Ayodhya Ram Mandir Pran Pratishtha is
a moment of national resurgence
అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలోని రామమందిరంలో బాల రాముడి
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రపంచ
చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం. ఐదు శతాబ్దాల పాటు హిందూ సమాజం
నిరంతర పోరాటం ఫలితంగా రామాలయ స్వప్నం సాకారమైంది. సాధుసంతుల మార్గదర్శనంలో
దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు ఫలించాయి.
పరిశోధకులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, నాయకులు, న్యాయవాదులు, పాత్రికేయులు,
కరసేవకులు, ఉద్యమంలో పాలు పంచుకున్న హిందూ సమాజం, ప్రభుత్వాలు, అధికారులు ఇలా
అన్నివర్గాల వారూ రామమందిర నిర్మాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించారు. ఎందరో
కరసేవకులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసారు. అలాంటి అమరవీరుల
త్యాగానికి అఖిల భారతీయ ప్రతినిధి సభ నివాళులర్పించింది. ఉద్యమంలో ఏదో ఒక రూపంలో
పాలుపంచుకుని, రామాలయ నిర్మాణాన్ని సాకారం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు
తెలిపింది.
నాగపూర్‌లో జరిగిన మూడు రోజుల సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ, అయోధ్యలో రామాలయ
నిర్మాణం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జాతీయ పునరుజ్జీవనానికి నిదర్శనంగా
నిలిచాయని ఏబీపీఎస్ వ్యాఖ్యానించింది. ఆ సందర్భంగా అక్షతల వితరణ కార్యక్రమంలో
యావత్ హిందూ సమాజమూ క్రియాశీలకంగా పాల్గొంది. లక్షలాది రామభక్తులు దేశంలోని అన్ని
పట్టణాలు, గ్రామాలకు వెళ్ళి కోట్లాది కుటుంబాలను కలిసి అక్షతలు వితరణ చేసారు. ఇక ప్రాణప్రతిష్ఠ
జరిగిన రోజు దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో సైతం పండుగలా జరిగింది. కాషాయ
ధ్వజాలతో ఊరేగింపులు, రామ భజనలు, నామ సంకీర్తనలు, గుడులలో విశేష పూజలూ… ఇలాంటి
కార్యక్రమాలు సమాజంలో ఒక కొత్త శక్తిని నింపాయి.
అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దేశంలోని ధార్మికవేత్తలు, రాజకీయ నాయకులు,
సమాజంపై ప్రభావం చూపే అన్ని రంగాల అగ్రగాములు, అన్ని మతాలు-శాఖలు-సంప్రదాయాల
సాధుసంతులు అందరూ పాల్గొన్నారు. దేశంలో సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం, రాముడు
ఆచరించి చూపిన విలువల ఆధారంగా జాతి జీవనాన్ని నిర్వహించడం ఈ ప్రాణ ప్రతిష్ఠ
కార్యక్రమంతో స్పష్టరూపం దాల్చాయి. భారతదేశంలో జాతీయ పునరుజ్జీవనం పునఃప్రారంభానికి
ఇది మొదలు. ఈ కార్యక్రమంతో హిందూ సమాజంలో స్వాభిమానం జాగృతమైంది. హిందుత్వ స్ఫూర్తి పెల్లుబికింది. హిందూ సమాజం
తన స్వీయ అస్తిత్వాన్ని గుర్తించింది.
మర్యాదాపురుషోత్తముడైన రాముడు మనకిచ్చేప్రేరణ ఏంటి? సమాజం కోసం, దేశం కోసం ఎంతటి
త్యాగమైనా చేయాలి. సామాజిక బాధ్యతలను నిబద్ధతతో పూర్తిచేయాలి. ఆదర్శప్రాయమైన రామరాజ్యాన్ని
సాధించాలి. పతనమైపోతున్న నైతిక విలువలు, సున్నితమైన భావనలను పరిరక్షించుకోవాలి. విస్తరణవాదపు
హింసను ఎదుర్కొని నిలబడాలి.
శ్రీరామచంద్రమూర్తి జీవితంలో పాటించిన ఆదర్శాలను అసరిస్తామని యావత్ సమాజమూ
ప్రతిజ్ఞ చేయాలి, అప్పుడే రామ మందిర పునర్నిర్మాణం అర్ధవంతమవుతుంది. త్యాగం,
ప్రేమ, అభిమానం, న్యాయం, ధైర్యం, సత్ప్రవర్తన వంటి సద్గుణాలను సమాజంలో మళ్ళీ
ప్రేరేపించాలి. అన్నిరకాల వివక్షలనూ తొలగించుకుని, పరస్పర విభేదాలను పరిష్కరించుకుని
సుహృద్భావ పూర్వకంగా మెలిగే సమాజ నిర్మాణమే రాముడికి మనం చేయగలిగే నిజమైన పూజ.
శ్రీరాముడి స్ఫూర్తితో తోటి ప్రజల పట్ల సోదరభావం, వృత్తి నిబద్ధత, విలువలపై
ఆధారపడిన జీవితం, సామాజిక న్యాయం కలిగుండే భారతదేశాన్ని నిర్మించాలని ఆర్ఎస్ఎస్
అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిచ్చింది.