కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్
కొట్టాలని, ఈ సారి ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు రావాలని అందుకు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పల్నాడు జిల్లా
బొప్పూడిలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెలుగు లో ప్రసంగం
మొదలు పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
‘‘నా ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఎలక్షన్ కోడ్
వచ్చిన తర్వాత తొలిసారి పల్నాడుకు వచ్చాను. కోటప్ప కొండలో కొలువైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తున్నా’’
అన్నారు.
ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలని
ఆకాంక్షించారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటే ఎన్డీయేకు 400 పై చిలుకు సీట్లు వచ్చేలా కృషి చేయాలని సభావేదిక నుంచి ప్రధాని కోరారు.
ప్రాంతీయ, జాతీయ భావాల కలయికగా ఎన్డీయే కూటమి ముందుకెళుతుందన్న ప్రధాని
మోదీ, కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుందన్నారు. ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారతదేశం అన్న
ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు. అప్పుడే వికసిత
ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు.
ఏపీ ఆవాస్ యోజన కింద 10 లక్షల ఇళ్లు కేంద్ర కేటాయించందని మోదీ వివరించారు. జలజీవన్
మిషన్ కింద కోటి ఇళ్లకు తాగునీరు అందించడంతో పాటు కిసాన్ సమ్మాన్ నిధితో
పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్‌తో ఏపీలో 1.25 కోట్ల మందికి లబ్ధి జరిగిందన్నారు.
విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూనివర్సిటీ విశాఖలో
ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్, మంగళగిరిలో ఎయిమ్స్ ను కేంద్రప్రభుత్వం
నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా, మధ్యలో ప్రధాని
నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నారు. పవన్ అంటూ మోదీ ఒక్కసారిగా పైకి లేచారు.
సభా ప్రాంగణంలో లైట్ టవర్లపైకి వివిధ పార్టీల
కార్యకర్తలు ఎక్కడాన్ని గమనించి వారిని కిందకు దింపారు.
“లైట్ టవర్స్ నుంచి దిగిపోండి… మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. ఆ
లైట్ టవర్లకు కరెంటు ఉంటుంది… కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నా.
ప్రమాదాలు జరిగితే ఎంతో బాధగా ఉంటుంది” అని మోదీ అన్నారు. మోదీ సూచనతో కార్యకర్తలంతా టవర్ నుంచి కిందకు
దిగారు.