అమెరికా
అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్
పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను
అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని హెచ్చరించారు.
అధ్యక్ష
ఎన్నిక జరిగే నవంబర్ 5, అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ
అని వ్యాఖ్యానించిన ట్రంప్, అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే అమెరికాకు దిగుమతి
చేసుకున్న కార్లను చైనా విక్రయించలేదని పేర్కొన్నారు.
ఒహియోలోని
వాండాలియాలో జరిగిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేసిన ట్రంప్, మెక్సికోలో కార్లను తయారు
చేసి వాటిని అమెరికన్లను అమ్మేందుకు చైనా సిద్ధమైందని విమర్శించారు. తాను అధ్యక్షుడిని అయితే చైనా ఎత్తులు చిత్తు
చేస్తానని ప్రకటించారు.
తన
ప్రత్యర్థి జో బైడెన్ను ‘చెత్త’ అధ్యక్షుడిగా అభివర్ణించిన ట్రంప్, వలసదారులకు
మిలియన్ల కొద్ది వర్క్ పర్మిట్లు మంజూరు చేసి, ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లకు వెన్నుపోటు
పొడిచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ట్రంప్
వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన ప్రచారం బృందం స్పందించింది. బైడెన్ విధానాల
కారణంగా అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఈ వ్యాఖ్యలు
చేశారని వివరించింది.
ట్రంప్
వ్యాఖ్యలను తప్పుబట్టిన బైడన్ టీమ్, అతివాదాన్ని అమెరికన్ ఓటర్లు మరోసారి ఓడించడం
ఖాయమన్నారు. గతంలో లాగానే ట్రంప్ మరోసారి ఓటమి చెందడం ఖాయమని జోస్యం చెప్పింది.