సందేశ్‌ఖాలీ కేసులో మరో ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ముఫుజర్ మొల్లా, సిరాజుల్ మొల్లా తో పాటు షేక్ షాజహాన్ సోదరుడైన షేక్ అలంగిర్ లను సీబీఐ అధికారులు సందేశ్ ఖాలీలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు అరెస్ట్ కాగా దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై దాడి కేసును విచారిస్తున్న సీబీఐ, మార్చి 11న ముగ్గురిని అరెస్టు చేసింది. దిద్రా బక్షా మొల్లా, ఫరూక్ అకూన్జి, జియాద్దీన్ మొల్లాలు సీబీఐ అదుపులో ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితులంతా టీఎంసీ బహిష్కృత నేత, సందేశ్ ఖాలీ నిందితుడు షేక్ షాజహన్ సన్నిహితులుగా విచారణలో తేలింది.
సందేశ్‌ఖాలీ ప్రాంతంలో షేక్ షాజహాన్ అక్రమాలకు పాల్పడటంతో పాటు అతని అనుచరులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు నమోదు కావడంతో దర్యాప్తు జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ టీఎంసీ నాయకుడి హోదాలో షాజహాన్ షేక్ పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. భూముల కబ్జా, దళిత మహిళలపై లైంగిక దాడులు పాల్పడ్డాడనేవి ప్రధాన ఆరోపణలు.
రేషన్ కుంభకోణం కేసు ను విచారించేందుకు వచ్చి ఈడీ బృందంపై షాజహాన్ అనుచరులు దాడికి తెగబడ్డారు. ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసులో షాజహాన్‌ను సీబీఐ అధికారులు విచారించాలంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫిబ్రవరి 29న పశ్చిమ బెంగాల్ పోలీసులు షాజహాన్ ను అరెస్ట్ చేసి సీబీఐకి అప్పగించారు.