సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో నోటిఫికేషన్ కూడా రానుంది. అయితే ఇప్పటికే ఓటు లేని వారు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు.
ఓటు నమోదు నిరంతర ప్రక్రియ. ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాల్లో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. ఇటీవల ఓటర్ల జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించారు. అందులో ఓటు లేని వారు మరోసారి నమోదు చేసుకోవచ్చు. ఫాం 8 ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు. సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో బీఎల్వోను సంప్రదించి ఓటు నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.