Festival of Democracy Celebrations Start Today
18వ లోక్సభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది.
దేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర
ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈసారి ఎన్నికల ప్రక్రియ
సుదీర్ఘంగా రెండున్నర నెలలకు పైగా సాగనుంది. ఈ షెడ్యూల్ ప్రకటనతో నేటినుంచే ఎన్నికల
కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది.
మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో 412 సాధారణ
నియోజకవర్గాలు, 84 ఎస్సీ నియోజకవర్గాలు, 47 ఎస్టీ నియోజకవర్గాలూ ఉన్నాయి.
ఈసారి ఎన్నికల్లో 96.8 కోట్ల మంది ఓటర్లు తమ
ఓటుహక్కును వినియోగించుకుంటారు. వారిలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు, 47.1 కోట్ల
మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉందని
రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణ కోసం 10.5 లక్షలకు పైగా పోలింగ్
స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 1.5 కోట్లు పోలింగ్ అధికారులు, భద్రతా అధికారులు
ఎన్నికలను నిర్వహిస్తారు. దానికోసం 55లక్షలకు పైగా ఈవీఎంలు,
4లక్షలకు పైగా వాహనాలు వినియోగించనున్నారు.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా 85ఏళ్ళ పైబడిన వయసున్న
ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. అన్ని పోలింగ్ బూత్లలోనూ తాగునీరు,
శానిటేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఒకేదశలో పోలింగ్ పూర్తయ్యే రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాలు 22 ఉన్నాయి. రెండు దశల్లో పోలింగ్ 4 రాష్ట్రాలు, యూటీల్లో
జరుగుతుంది. 2 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్ మూడు దశల్లో జరుగుతుంది. నాలుగు దశల్లో
పోలింగ్ 3 రాష్ట్రాలు. యూటీల్లో జరుగుతుంది. ఐదు దశల్లో పోలింగ్ రెండు
రాష్ట్రాల్లో జరుగుతుంది. మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ 3 రాష్ట్రాల్లో జరుగుతుంది.
అలా మొత్తం అన్ని దశల్లోనూ పోలింగ్ జరిగే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ (80 ఎంపీ
సీట్లు), బిహార్ (40ఎంపీ సీట్లు), పశ్చిమ బెంగాల్ (42 ఎంపీ సీట్లు).
ప్రస్తుత 17వ లోక్సభ గడువు జూన్ 16తో
ముగుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెలిచి అధికారం కైవసం
చేసుకుంటే, కాంగ్రెస్ 52 స్థానాలకు పరిమితమైంది.