ఎన్నికల
ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్
కేఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లను
ఆదేశించారు.
విజయవాడలోని
సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు.
సీఎస్
మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24
గంటలు లోగా ప్రభుత్వ ఆస్తులపై ఉన్న వాల్
రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, రాజకీయ పార్టీల జెండాలు తొలగించాలని
ఆదేశించారు.
ప్రింట్,
ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల ప్రచారాలను
నిలిపివేయాలన్నారు.
ప్రభుత్వ
వెబ్సైట్లలో మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాజకీయ
పార్టీలకు సంబంధించిన ఫోటోలు తొలగించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
ఎన్నికల
ప్రకటన వెలువడిన తర్వాత మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదని
స్పష్టం చేశారు. మంత్రుల ఎన్నికల పర్యటనలకు ప్రభుత్వ అతిథిగృహాలను కేటాయించరాదన్నారు.
ప్రభుత్వ నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులపై ఎంపీ,
ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజా ప్రతినిధుల
ఫొటోలు ఉండరాదన్నారు.
ప్రభుత్వ
భవనాలు, కార్యాలయాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదన్నారు.
మంత్రులు అధికారుల మధ్య వీడియో సమావేశాలు నిర్వహించరాదన్నారు.
ఎన్నికల
కోడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు
అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళరాదన్నారు.
ప్రభుత్వ
ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు
నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, ఇతర లబ్ధి పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ
సెక్షన్ 171 మరియు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
బడ్జెట్
ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల
మంజూరు, కన్సిజన్లు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఎస్ స్పష్టం చేశారు.
పీఎం,
సీఎ సహాయ నిధి కింద గుండె, కిడ్నీ, కేన్సర్ వంటి రోగులకు చికిత్స కోసం అందించే సాయానికి ఆయా శాఖలకు
ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.