వేసవిలో
భానుడు పూర్తి స్థాయిలో విజృంభించక ముందే రాష్ట్రంలో నీటి నిల్వలు అడుగంటాయి.
రోహిణికార్తె వస్తే పరిస్థితేంటో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి లభ్యత
తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే బోర్లు, బావులు వట్టిపోయాయి. పరిస్థితి ఇంకా
ముదిరితే ఆంధ్రప్రదేశ్ ప్రజల తాగు,సాగు నీటి కష్టాలు, బెంగళూరును తలపించడం ఖాయంగా
ఉంది.
ఆంధ్రప్రదేశ్
లోని జలాశయాల్లో సాధారణం కంటే 68 శాతం తక్కువ నీటి నిల్వలు ఉన్నట్లు వారాంతపు నివేదిక(మార్చి14)లో
కేంద్ర జల సంఘం పేర్కొంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్
లో సాధారణస్థాయి కంటే 50 శాతం తక్కువకు నిల్వలు చేరినట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి.
తెలంగాణలో సాధారణం కంటే
పదిశాతం తక్కువ నిల్వలు ఉండగా, మరో పొరుగురాష్ట్రమైన తమిళనాడు లో 27 శాతం తక్కువ
నిల్వలు ఉన్నట్లు ప్రస్తుత లెక్కల ప్రకారం తేలింది.
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని 42 జలాశయాల నిర్వహణ కేంద్ర జలసంఘం పరిధిలో ఉంది. ఈ
రిజర్వాయర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 53.334 బిలియన్ల ఘనపు మీటర్లు.
మార్చి
14 నాటికి దక్షిణాదిలోని 42 నీటి ప్రాజెక్టుల్లో కేవలం13.054 బిలియన్ క్యూబిక్ మీటర్ల
నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇది కనీస స్థాయి కంటే 24శాతం తక్కువ. దేశంలోని మిగతా ప్రాంతాల
కంటే అతితక్కువ శాతానికి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గత
ఏడాది ఈ సమయంలో 42 శాతం ఎక్కువగా ఉండగా, గత పదేళ్ళ సగటు మాత్రం 34 శాతంగా ఉంది. గత
ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
వేసవి
పూర్తి స్థాయి ప్రతాపాన్ని చూపకముందే బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు తలుచుకుంటే ఆందోళన కలుగుతోంది.
అవసరాలకు
తగ్గట్టు నీటి సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తెలిపారు.
గత ఏడాది గణనీయమైన వర్షపాతం లోటు కారణంగా జలాశయాలు నిల్వలు పడిపోయాయన్నారు. తాగు,
సాగు, ఇతర అవసరాలకు నీటి సరఫరాను నిశితంగా గమనిస్తున్నామన్నారు.