పొత్తులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో
బీజేపీ ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతోందని ఆ పార్టీలోని కొందరు ముఖ్యనేతలు ఆవేదన
చెందుతున్నారు. గతంలోనూ పొత్తులు, సీట్ల సర్దుబాటు కారణంగా బీజేపీకి పూడ్చలేని
నష్టం జరిగిందని ఆ పార్టీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
టీడీపీ
నుంచి వలస వచ్చిన నేతలకు బదులుగా
ఆంధప్రదేశ్ బీజేపీ ఎదుగుదల కోసం
శ్రమిస్తోన్న నేతలకు ఎక్కువ సీట్లు కేటాయించేలా అధిష్టానం ఆలోచించాలని లేఖలో
కోరినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు అధిష్టానం అనుసరిస్తున్న ప్రక్రియను
తప్పుపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ, లోక్సభ టికెట్ల విషయంలో
జరుగుతున్న పుకార్లతో ఏపీ బీజేపీ శాఖ నిరాశ చెందిన విషయాన్ని లేఖలో ప్రసావించారు.
గరికపాటి సీతారామాంజనేయ చౌదరి(తపన
చౌదరి), జీవీఎల్ నరసింహరావు, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి లు అసెంబ్లీ, లోక్సభ
సీట్లలో ఎదో ఒక్కటి దక్కుతుందని ఆశిస్తున్నారు.
అయితే వారికి బదులు, 2019లో టీడీపీ
ఓటమి తర్వాత బీజేపీలో చేరిన సుజనా చౌదరి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి లు టికెట్
రేసులో ముందు ఉన్నట్లు ప్రచారం జరగడాన్ని లేఖ ద్వారా పార్టీ కోర్ కమిటీ దృష్టికి
తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
ఏలూరు పార్లమెంటు స్థానానికి కమలం
గుర్తు పై పోటీ చేసేందుకు తపన చౌదరి ఆసక్తిగా చూపుతుండగా సుజనా చౌదరి నుంచి పోటీ
ఎదుర్కొంటున్నారు. హిందుపురం లోక్సభ సీటు లేదా కదిరి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని
విష్ణువర్ధన్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం,
మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఆయనకు ఆ రెండు టికెట్లలో ఏ ఒక్కటీ దక్కే
పరిస్థితిలేదు. దీంతో పొత్తులపై ఆయన నిష్ఠూరాలు ఆడుతున్నారు.
విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీకి
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సిద్ధమయ్యారు. కానీ పొత్తుల కారణంగా అక్కడ టీడీపీకి
సీటు వదిలేయాల్సిన పరిస్థితి దాపురించింది. టీడీపీ తరఫున భరత్ అక్కడ పోటీకి
సిద్ధమయ్యారు. దాదాపు ఏడాది కాలంలో విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలో తరచూ పర్యటించిన
జీవీఎల్ పార్టీ బలోపేతానికి శ్రమించారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో పలు అభివృద్ధి కార్యక్రమాలు
అమలు జరిగేలా తోడ్పడ్డారు. పొత్తుల కారణంగా తాను పోటీ చేయలేకపోవడంపై జీవీఎల్ కూడా
నిట్టూర్పు వ్యాఖ్యలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో
బలమైన అభ్యర్థి లేనప్పటికీ ఆ సీటును తమకు అంటగట్టడం వెనుక ఉద్దేశం ఏంటని బీజేపీ
నేతలు ప్రశ్నించారు. జనసేన తరఫున అక్కడి నుంచి పోటీకి పోతిన మహేశ్ ఆసక్తి చూపుతున్నారు.
పొత్తు ధర్మంలో భాగంగా పోటీ నుంచి తప్పుకునేందుకు కూడా ఆయన సిద్ధంగా లేరు. ఈ
పరిణామాలపై బీజేపీ రాష్ట్ర శాఖ ఒకింత అసహనం వ్యక్తం చేస్తోంది.
పొత్తుకు వ్యతిరేకం కాదంటూనే నమ్మదగిన
వారు కాని అభ్యర్థులకు మద్దతు ఇవ్వలేమని విష్ణువర్ధన్ రెడ్డి సహా పలువురు నేతలు
స్పష్టం చేశారు. బీజేపీకి కేటాయించిన ఆరు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ
కానీ బీజేపీకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే పరిస్థితి లేదంటున్నారు. పార్టీ
బలహీనంగా ఉన్న స్థానాలను కేటాయించడం బీజేపీకి వెన్నుపోటు పొడవడమేనని లేఖలో
వివరించారు.
పార్టీ సిద్ధాంతాలకు లోబడి బీజేపీ విస్తరణకు శ్రమించిన
నేతలకు టికెట్లు ఇవ్వాలని కోరినప్పటికీ జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదని
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమలం గుర్తు పై పోటీ చేసే అభ్యర్థులు కూడా టీడీపీ
తో సన్నిహితంగాల మెలిగే వారనే ప్రచారం జరగడం, బీజేపీకి తీవ్ర నష్టం చేస్తుందని
అభిప్రాయం వ్యక్తం చేశారు.
రహస్య అజెండాతోనే బీజేపీతో టీడీపీ పొత్తు
పెట్టుకుందని, పథకం ప్రకారం కొందరు నేతలను సంతృప్తి పరిచే ప్రక్రియలో బీజేపీకి
ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీని
బలహీన పరిచే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందంటున్నారు.
విశాఖపట్నం బీజేపీ యూనిట్ నుంచి మరో లేఖను
జాతీయ అధ్యక్షుడు నడ్డాకు రాసినట్లు తెలుస్తోంది. బీజేపీ, లేదా కూటమి నుంచి కమలం
గుర్తుపై అభ్యర్థి పోటీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.