గత నెలలో ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి అపూర్వ స్పందన లభించింది. కోటి మందికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకం ప్రారంభించగా ఇప్పటికే కోటి మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారని ప్రధాని మోదీ శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే సోలార్ విద్యుత్ పరికరాల ద్వారా ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. వారు ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు అందించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి రాయితీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో 75 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కోటి ఇళ్లకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ పథకం కింద గ్రామ పంచాయతీ కార్యాలయాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు ఏడాదికి 15 వేల నుంచి 18 వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని అంచనా.
ఈ పథకం అమలు వల్ల లక్షలాది యువతకు ఉపాది లభించడంతోపాటు, సోలార్ ఫ్యానెల్స్ తయారీ పరిశ్రమలకు లబ్ది చేకూరనుంది. దేశంలో నేటికి 70 శాతంపైగా థర్మల్ విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈ పథకం వల్ల బొగ్గు మండించడం కొంత మేర తగ్గుతుంది. దేశంలో ప్రస్తుతం 5 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 2030 నాటికి మొత్తం విద్యుత్ వినియోగంలో సగం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా
ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2070 నాటికి పూర్తిగా పునురుత్పాదక ఇంధన వనరుల ద్వారా మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి.