BRS leader Kavita arrest in Delhi liquor scam, what it indicates?
భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ మాజీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఆ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల
కవితను నిన్న సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ
పరిణామం దేనికి సంకేతం అన్న చర్చ మొదలైంది.
కవితను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం
నుంచి ఢిల్లీకి తరలించేసరికి సుమారు అర్ధరాత్రి అయింది. ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకువెళ్ళి, ఆ తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు
నిర్వహించారు. కవితను ఈ ఉదయం 10.30 సమయంలో రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు.
కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం కవితకు రిమాండ్ విధించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని
కోరతారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం
చేసారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి.
ఢిల్లీ రాష్ట్రంలో మద్యం పాలసీని కొందరికి
అనుకూలంగా ఉండేలా మార్చిన కుంభకోణంలో కవిత ఒక నిందితురాలు. ఆ కేసుకు సంబంధించి
ఢిల్లీ ప్రభుత్వంలో అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలోని మనీష్ సిసోడియా 2023
ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. అప్పటినుంచీ ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. బెయిల్ కోసం
ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దానిపై ఆయన సుప్రీంకోర్టులో
క్యురేటివ్ పిటిషన్ వేసారు. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా నిన్ననే తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయన్న
విషయం అర్ధమవుతోంది. ఆ లెక్కన కవితకు కూడా బెయిల్ వస్తుందో రాదో అనుమానమే.
కవిత అరెస్ట్ పరిణామాలు రాజకీయంగానూ ప్రభావం
చూపవచ్చు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు సరిగ్గా ఒక్కరోజు ముందు కవితను అరెస్ట్
చేయడం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై విభిన్న భాష్యాలు వినిపిస్తున్నాయి.
ఈ అరెస్ట్ వ్యవహారంతో బీఆర్ఎస్కు సానుభూతి పెరిగే అవకాశాలు చాలా తక్కువ, అయినా
కొద్దిగానైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌లో
రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలోనే ఆమెను అరెస్ట్ చేయడం… బీజేపీ, బీఆర్ఎస్ మధ్య
రాజకీయ వైరానికి నిదర్శనమన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. మూడు నెలల క్రితం
తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఆ రెండుపార్టీల మధ్యా లోపాయికారీ పొత్తు
ఉన్నందువల్లనే కవితను అరెస్ట్ చేయలేదన్న వాదనలు వినిపించాయి. కోర్టులో ఉన్న కేసు
విషయంలో ఈడీ అధికారులు స్వతంత్రంగా వ్యవహరిస్తారు తప్ప కేంద్రప్రభుత్వ ప్రమేయం
ఉండదు అంటూ బీజేపీ చేసిన వాదనను ఎవరూ విశ్వసించలేదు. ఇప్పుడు కవిత అరెస్ట్‌తోనైనా
బీజేపీ-బీఆర్ఎస్ లోపాయికారీ పొత్తు అనే పుకార్లకు అడ్డుకట్ట పడుతుందని కమలం పార్టీ
ఆశిస్తోంది.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఇరకాటంలో పడిన పరిస్థితి. ఈడీ ఇప్పటికి 8 సార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు
హాజరవకుండా తప్పించుకుంటున్న కేజ్రీవాల్ గతి ఎలా ఉండబోతోంది? రాజకీయంగా తనను
వేధించడం కోసమే కేసు పెట్టారన్న కేజ్రీవాల్ వాదనను న్యాయస్థానాలు ఒప్పుకోవడం లేదు.
తొలుత మేజిస్ట్రేట్ కోర్టు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దానిపై
స్టే విధించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సెషన్స్ కోర్టు నిరాకరించింది.
విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావలసిందేనని ఆదేశించింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సాకుతో వర్చువల్‌గా హాజరైన కేజ్రీవాల్, తదుపరి విచారణకు
వ్యక్తిగతంగా హాజరవుతానని విజ్ఞప్తి చేసారు. దానికి కోర్టు ఒప్పుకుని విచారణ
వాయిదా వేసింది. ఇప్పుడు కవిత అరెస్ట్ నేపథ్యంలో కేజ్రీవాల్ మెడ మీద కూడా అరెస్ట్
అనే కత్తి వేలాడుతోందని భావించవచ్చు.
అయితే, ప్రధానమంత్రి రోడ్
షో జరుపుతున్న సమయంలోనే ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేయడం చూస్తూంటే,
ఈడీ కేంద్రప్రభుత్వం చెప్పినట్లే ఆడుతోందన్న ప్రచారాలు తప్పులని అర్ధమవుతోంది.
ఇప్పటికే న్యాయవ్యవస్థ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా లేదన్న సంగతి
తెలిసిందే. దాంతో కవితకు బెయిల్ లభిస్తుందా లభించదా అన్న విషయం ఆసక్తి
కలిగిస్తోంది.