India furious on US comments on CAA
పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత్ ఎలా అమలు చేస్తుందో
నిశితంగా పరిశీలిస్తామంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశ అంతర్గత విషయాల్లో అమెరికా అనవసరంగా జోక్యం చేసుకోడాన్ని సహించబోమంటూ
విరుచుకుపడింది.
‘‘పౌరసత్వ సవరణచట్టం ఉద్దేశం పౌరసత్వం ఇవ్వడం,
అంతేతప్ప తీసేయడం కాదు. ఆ చట్టం దేశమంటూ లేనివారి సమస్యలను పరిష్కరిస్తుంది, మానవ
హక్కులను పరిరక్షిస్తుంది, మతవివక్షతో చిత్రహింసలపాలైన వారికి ఆత్మగౌరవాన్ని కల్పిస్తుంది.
ఆ చట్టం అమలు విషయంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు అత్యంత అవాంఛనీయం. సరైన సమాచారం
లేకుండా చేసిన ఆ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ అధికార
ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేసారు.
‘‘భారతదేశపు వైవిధ్యభరితమైన సంప్రదాయాల గురించి,
దేశ విభజన అనంతర చరిత్ర గురించి పరిమితమైన జ్ఞానం కలిగిన వారిచ్చే ప్రకటనలను
పట్టించుకోనవసరం లేదు. భారతదేశపు మంచి కోరుకునేవారు, దేశ భాగస్వాములు ఈ చట్టం అమలు
వెనుక ఉద్దేశాన్ని అర్ధం చేసుకుని స్వాగతించాలి’’ అంటూ ఘాటుగా స్పందించారు.
‘‘భారతీయులందరికీ మన దేశ రాజ్యాంగం మతస్వేచ్ఛనిచ్చింది.
మైనారిటీల విషయంలో ఆందోళన చెందుతామనే వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాతిపదికా లేదు. బాధలో
ఉన్నవారికి సాయం చేయడం కోసం తీసుకున్న ప్రశంసనీయమైన ముందడుగును ఓటుబ్యాంకు
రాజకీయాల కారణంతో అంచనా వేయకూడదు’’ అని రణధీర్ జైస్వాల్ కుండ బద్దలుగొట్టారు.
అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మ్యాథ్యూ
మిల్లర్ ఈ ఉదయం మాట్లాడుతూ సీఏఏ భారతదేశంలో మతస్వేచ్ఛపై ప్రభావం చూపుతుందన్న
ఆందోళన వ్యక్తం చేసారు. సీఏఏ ఎలా అమలువుతుందో తాము నిశితంగా పరిశీలిస్తామన్నారు.