RSS Akhil Bhartiya Pratinidhi Sabha Annual Meeting
Commenced at Nagpur
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ
ప్రతినిధి సభ వార్షిక సమావేశాలు నాగపూర్ లో ఇవాళ మొదలయ్యాయి. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్
డాక్టర్ మోహన్ భాగవత్,ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే భరతమాత చిత్రపటానికి పూలమాలలు
వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల ఈ సమావేశాలు మహారాష్ట్ర నాగపూర్‌లోని
రేషిమ్‌బాగ్ స్మృతి మందిర్ కాంప్లెక్స్‌లో జరుగుతున్నాయి. మొత్తం 45 ప్రావిన్సుల నుంచి 1500 మందికి పైగా
కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంఘ కార్య విస్తరణ గురించి డాక్టర్
మన్మోహన్ వైద్య వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో పని పరంగా 45 ప్రావిన్సులు ఉన్నాయి. తరువాత శాఖ, జిల్లా, బ్లాక్ ఉన్నాయి. దేశం మొత్తం
73,117 సంఘ శాఖలు ప్రతీరోజూ జరుగుతాయి. గత ఏడాది
వ్యవధిలో 4466 కొత్త శాఖలు ఏర్పాటు అయ్యాయి. ఈ శాఖల్లో
60 శాతం మంది విద్యార్థులు, 40 శాతం మంది ఉద్యోగులు లేదా వృత్తి కార్మికులు ఉన్నారు. ఇందులో 40 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 11 శాతంగా ఉంది.
వారపు సమావేశాల సంఖ్య 27,717. సంఘ మండలి సంఖ్య 10,567. నగరాలు, మెట్రో నగరాల్లోని 10,000 ఆవాసాల్లో 43,000 ప్రత్యక్ష శాఖలు ఉన్నాయి.
మహిళా సమన్వయ కృషిలో భాగంగా రాష్ట్ర
సేవికా సమితి 44 రాష్ట్రాల్లో 460 మహిళా సదస్సులు నిర్వహించింది. వాటిలో 5.61 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. సంఘ శతాబ్ది సంవత్సరానికి సన్నద్ధత
దృష్ట్యా మహిళా సమన్వయం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయ ఆలోచన, సామాజిక మార్పులో
మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం.
అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది
వేడుకలు 2024 మే నుంచి 2025 ఏప్రిల్ వరకు జరగనున్నాయి. అహల్యాబాయి హోల్కర్ దేశవ్యాప్తంగా ధార్మిక
ప్రదేశాలను పునర్నిర్మించారు, నిరుపేద ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేశారు. ఆమె
లక్ష్యాలను భారతదేశం అంతటా విస్తరించే పని జరుగుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో
వంద శాతం ఓటింగ్ జరిగేలా సంఘ్ స్వయంసేవకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన
కల్పించనున్నారు.
అయోధ్యలోని రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ
కార్యక్రమాల కోసం సంఘ్ తన విస్తృతమైన ప్రజా సంబంధాలను వినియోగించింది. బాలరాముడి
అక్షింతల పంపిణీ పనిని స్వయంసేవకులు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి
దేశప్రజల నుంచి ఉత్సాహభరితమైన ప్రతిస్పందన, స్వాగతసత్కారాలూ లభించాయి.
ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ ప్రచార
ప్రముఖ్ సునీల్ అంబేకర్, ఆలిండియా పబ్లిసిటీ చీఫ్ ద్వయం నరేంద్ర కుమార్, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.