డీఎంకే,
కాంగ్రెస్ కూటమి పాలనలో తమిళనాడు ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని ప్రధాని నరేంద్ర
మోదీ అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పాలనంతా అవినీతి, అక్రమాలకు నెలవుగా
మారిందన్నారు. కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన చరిత్ర డీఎంకే, కాంగ్రెస్
భాగస్వామిగా ఉన్నఇండీకూటమిదంటూ తూర్పారబట్టారు.
తమిళనాడులో
పర్యటించిన ప్రధాని మోదీ, కన్యాకుమారిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో
పాల్గొని ప్రసంగించారు.
1991
లో ఏక్తా యాత్ర చేపట్టిన సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు వరకు తాను
పర్యటించిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ, ప్రస్తుతం కశ్మీర్ నుంచి కన్యాకుమారి
వచ్చానన్నారు. భారత్ లో విభజన రాజకీయాలకు
పాల్పడేవారిని జమ్ము- కశ్మీర్ ప్రజలు తిరస్కరించారన్నారు.
ప్రస్తుతం
తమిళనాడు ప్రజలు కూడా అదే చేయబోతున్నారని చెప్పారు.
మహిళలతో
ఎలా అనుచితంగా ప్రవర్తించాలో డీఎంకే, కాంగ్రెస్ కే తెలుసంటూ చురకలు అంటించిన
ప్రధాని మోదీ, స్త్రీల పేరిట డీఎంకే రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు.
జయలలిత
పట్ల గతంలో డీఎంకే నేతలు ఎలా ప్రవర్తించారో ప్రతీ ఒక్కరికీ తెలుసున్న మోదీ, ఆ
పార్టీ నేతల వైఖరి ఇప్పటికీ అలాగే ఉందన్నారు. స్టాలిన్ పాలనలో మహిళలపై దాడులు
పెరిగాయన్నారు.
మహిళల
సాధికారత కోసం ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇవ్వలేదని
దెప్పిపొడిచారు. రెండు పార్టీలూ మహిళా వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నాయని ఆగ్రహం
వ్యక్తం చేశారు.
తమిళనాడులో
ఓడరేవుల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యమిస్తోందన్న ప్రధాని మోదీ,
తూత్తుకుడిలో చిదంబరనార్ పోర్టును ఇటీవల ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారుల
సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఆధునిక హంగులున్న
ఫిషింగ్ బోట్లు అందజేయడంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పరిధిలోకి
మత్స్యకారులను తీసుకొచ్చామన్నారు.
బీజేపీ పాలనలో సంక్షేమ
కార్యక్రమాలు అమలు జరిగితే గత కాంగ్రెస్ కూటమి పాలనలో 2జీ స్కామ్ జరిగిందన్నారు.
తమిళనాడులోని కాంగ్రెస్-డీఎంకే కూటమి
దురహంకారాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బద్దలు కొట్టడం ఖాయమన్నారు.