రాష్ట్రీయ
స్వయం సేవక్ సంఘ్(RSS), వార్షిక శిక్షణా కేలండర్ లో
మార్పులు చేర్పులు చేసింది. శిక్షణా కార్యక్రమాల పేర్ల మార్పుతో పాటు పలు సవరణలు
చేసినట్లు ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు.
నాగపూర్
లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మొదలైన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమ్మేళనం
సందర్భంగా, శిక్షణా కార్యక్రమాల్లోని మార్పుల గురించి మన్మోహన్ వైద్య వివరించారు.
ఏడు
రోజుల ప్రాథమిక శిక్షా వర్గ, 20 రోజుల సంఘ్ శిక్షా వర్గ-ప్రథమ వర్ష్, 20 రోజుల
సంఘ్ శిక్షా వర్గ-ద్వితీయ వర్ష్, అలాగే 25 రోజుల సంఘ్ శిక్షా వర్గ- తృతీయ వర్ష్ శిక్షణలో స్వల్ప మార్పులు చేశామన్నారు.
కొత్తగా
సంఘంలో చేరిన వారి కోసం మూడు రోజుల ప్రారంభిక వర్గ శిక్షణా కార్యక్రమాన్ని
తీసుకొచ్చినట్లు మన్మోహన్ వైద్య తెలిపారు. సంఘంలోకి కొత్తగా వచ్చిన వారు ప్రాథమిక
శిక్షా వర్గ శిక్షణ పూర్తి చేయడంతో పాటు 15 రోజుల వ్యవధి కలిగిన సంఘ్ శిక్షా వర్గను
అభ్యసించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు దీనిని సంఘ్ శిక్షా వర్గ- ప్రథమ వర్ష్ గా
పిలిచే వారు. గతంలో ఈ శిక్షణ 20 రోజుల పాటు ఉండేది.
యువత
పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాలకు హాజరవుతున్నారు. ప్రతీ ఏడాది 15 వేల
నుంచి 17 వేల మంది ప్రాథమిక శిక్షా వర్గ (ప్రథమ వర్ష) ను అభ్యసిస్తున్నారు.
ప్రాథమిక శిక్షా వర్గ కార్యక్రమంలో లక్షమంది పాల్గొంటున్నారు.
ఇక
నుంచి సంఘ్ శిక్షా వర్గ తొలి ఏడాది 15 రోజుల పాటు కొనసాగుతుందని వైద్య వెల్లడించారు.
గతంలో నిర్వహించిన ద్వితీయ వర్ష, తృతీయ వర్ష శిక్షణా తరగతులను కార్యకర్త వికాస్
వర్గ-1, కార్యకర్త వికాస్ వర్గ -2గా పిలవనున్నట్లు ఆర్ఎస్ఎస్ నేత వెల్లడించారు.
తృతీయ
వర్ష సిలబస్ లో కొద్దిపాటు మార్పులు చేశారు. అభ్యాసకులను ఐదు రోజుల పాటు క్షేత్రస్థాయి
పర్యటనకు తీసుకెళ్ళడం ద్వారా ప్రవర్తించే
విధానం పై అవగాహన కల్పిస్తామన్నారు.
కొత్త
సిలబస్ తో పాటు కొత్త పేర్లను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సంఘం నిర్ణయించింది.
ఆర్ఎస్ఎస్
సమ్మేళనంలో లోక్ సభ ఎన్నికల గురించి చర్చ జరుగుతుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఓటు హక్కు వినియోగంపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు
ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకునేలా
చైతన్య పరచడంలో ఆర్ఎస్ఎస్ ముందు వరుసలో ఉంటుందన్నారు.