లోక్
సభ-2024 ఎన్నికలకు సంబంధించి రేపు(మార్చి 16) షెడ్యూల్ విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం
మూడు గంటలకు కేంద్రఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఎలక్షన్ టైమ్ టేబుల్
వెల్లడించనుంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన
వివరాలను ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం
తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
ఏప్రిల్-మే నెలల్లో అరుణాచల్ ప్రదేశ్,
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లో షెడ్యూల్
మేరకు బ్యాలెట్ ఫైట్ జరగనుంది.
ఇక
ప్రస్తుత లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. దీంతో దేశవ్యాప్తంగా లోక్ సభ
ఎన్నికలు జరగనున్నాయి. అయితే జమ్ము-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే
విషయంపై రేపు ఈసీఐ నిర్వహించే ప్రెస్ మీట్ లో స్పష్టత వచ్చే అవకాశముంది.
లోక్ సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం, ఇప్పటికే సమీక్షలు
నిర్వహించింది. గత లోక్ సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ జారీ కాగా, ఏప్రిల్
11 నుంచి మే 19 వరకు ఏడు విడతలుగా పోలింగ్ జరిగింది. మే 23న ఓట్లు లెక్కింపు జరిగింది.