2024 is a year of
elections
ప్రపంచ ఎన్నికల చరిత్రలో 2024 ప్రత్యేక
సంవత్సరంగా నిలిచిపోతుంది. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 60 దేశాల్లో ఎన్నికలు
జరగబోతున్నాయి. ఒక యేడాది అన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే మొదలు. మళ్ళీ 2048
వరకూ ఇంత పెద్దసంఖ్యలో ఎన్నికలు జరిగే అవకాశమూ లేదు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని సుమారు
60 దేశాల్లో ఈ యేడాదే ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 27 దేశాల యూరోపియన్ యూనియన్
కూడా ఉంది. వాటి వివరాలు చూస్తే…
ఆఫ్రికాలోని 18 దేశాల్లోనూ, ఆసియాలోని 17 దేశాల్లోనూ, ఉత్తర అమెరికాలోని 5
దేశాల్లోనూ, ఓసియానియాలోని 4 దేశాల్లోనూ, దక్షిణ అమెరికాలోని 2 దేశాల్లోనూ జాతీయ
ఎన్నికలు జరుగుతాయి. అమెరికాకు చెందిన ఇంటిగ్రిటీ ఇనిస్టిట్యూట్ అంచనా ప్రకారం,
2048 వరకూ ఒకే యేడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగబోవు.
ప్రపంచంలోని మూడు అతిపెద్ద ప్రజాస్వామ్య
దేశాలు – భారత్, అమెరికా, ఇండోనేషియా – ఈ మూడు దేశాల్లోనూ ఈ యేడాదే ఎన్నికలు
జరుగుతున్నాయి. కేవలం ఈ మూడు దేశాల్లోనే 2వందల కోట్ల మందికి పైగా ప్రజలు తమ
ఓటుహక్కు వినియోగించుకుంటారు. వీటిలో మొదటగా ఇండోనేషియాలో ఎన్నికలు జరుగుతున్నాయి.
అక్కడ ఎన్నికలు ఫిబ్రవరి 14న మొదలయ్యాయి.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
భారతదేశం. ఇక్కడ ఈ యేడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. నరేంద్ర మోదీ
నాయకత్వంలోని బీజేపీ, ప్రతిపక్షాల ఇండీ కూటమి మధ్య ఈ పోరు జరగనుంది.
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 5న ఎన్నికలు
జరుగుతాయి.16కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు తమ దేశపు 60వ అధ్యక్షుణ్ణి
ఎన్నుకుంటారు.
27దేశాల కూటమి యూరోపియన్ యూనియన్‌కు జూన్
6 నుంచి 9 వరకూ ఎన్నికలు జరుగుతాయి. మరో 9 ఐరోపా దేశాల్లోనూ ఎన్నికలు ఈ యేడాదే
జరుగుతాయి. వాటిలో ప్రస్తుతం యుద్ధం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు కూడా
ఉన్నాయి. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి
15 నుంచి 17 వరకూ జరుగుతాయి. ఉక్రెయిన్‌లో మార్చి 31న ఎన్నికలు నిర్వహిస్తారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా ఈ యేడాదే
ఎన్నికలు జరుగుతాయి. యూకే ప్రధానమంత్రి ఋషి శునక్ ప్రకటనలను బట్టి 2024 ద్వితీయార్థంలో
ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
దక్షిణాసియాలో భారతదేశంతో పాటు దాని
పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, భూటాన్‌లలో ఈ యేడాది
ఎన్నికలు నిర్వహిస్తారు.
బంగ్లాదేశ్‌లో జనవరి 7న ఎన్నికలు
జరిగాయి. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. షేక్
హసీనా నాయకత్వంలోని ఆ కూటమి వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక
పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి.
మరో పొరుగుదేశం శ్రీలంకలో ఈ యేడాదిసెప్టెంబర్-అక్టోబర్
సమయంలో ఎన్నికలు జరగవచ్చు. ఆర్థిక సంక్షోభం, దివాలా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో
2018 నుంచీ ఎన్నికలు జరగలేదు. ఈ యేడాది లంకలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
అలా మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా
సుమారు 60 దేశాల్లో ఈ యేడాది ఎన్నికలు జరుగుతాయి. ఇంత ఎన్నికల కోలాహలం మళ్ళీ 2048
వరకూ కనిపించే అవకాశం లేకపోవడం గమనార్హం.